కరోనా నిర్ధరణ తర్వాత ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ కొందరు ప్రాణాలు కోల్పోతుండగా.. మరికొందరికి చనిపోయాక వైరస్ సోకినట్లు గుర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో మృతదేహాల నుంచి వైరస్ సోకే ప్రమాదం ఉండటం వల్ల వాటి ఖననాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. 8 మందితో కూడిన కమిటీ.. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విధివిధానాల అమలును పర్యవేక్షిస్తోంది. కేవలం ఐదుగురిని మాత్రమే చివరి చూపు చూసేందుకు అనుమతి ఇస్తున్నారు.
4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతతో..
అంత్యక్రియలకు సంబంధించి కుటుంబసభ్యులకు అధికారులు ముందే కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మృతదేహంపై వైరస్ నిరోధక ద్రావణం పిచికారీ చేసి.. ప్రత్యేక బ్యాగ్‌లో ఉంచి సీల్ వేస్తున్నారు. 4 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతతో మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలిస్తున్నారు. కడసారి చూసేందుకు.. 4 మీటర్ల దూరంలో గీత గీసి.. అక్కడి నుంచి చూసే వీలు కల్పిస్తున్నారు. మతపరమైన ఆచారాలను 4 మీటర్ల దూరం నుంచే చేయాలని కుటుంబసభ్యులకు చెబుతున్నారు. 8 అడుగుల లోతు తవ్విన గుంతలో మృతదేహాన్ని పూడ్చేస్తున్నారు. అనంతరం శ్మశానవాటికలో రెండుసార్లు క్రిమిసంహారక మందు పిచికారీ చేస్తున్నారు.