జీవ ఔషధ రంగంలో అంకురాల కోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో హబ్‌ను ఏర్పాటు చేసి... దాని ద్వారా ఔషధరంగాన్ని అభివృద్ధి పరచాలని భావిస్తోంది. దేశంలో మొట్టమొదటిసారిగా ఔషధరంగానికి ప్రత్యేక హబ్‌ను ఏర్పాటు చేయనున్నారు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలంలోని జీనోమ్‌వ్యాలీలోని కొల్లూరు, లాల్‌గడిమలక్‌పేట గ్రామాల మధ్య 2.7 ఎకరాల విస్తీర్ణంలో 60 కోట్ల 37 లక్షలతో దీన్ని నిర్మించనున్నారు. ఆకృతి, నిర్మాణం, నిర్వహణ, అప్పగింత ప్రాతిపదికన ప్రముఖ సంస్థల నుంచి ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించింది.
ఔషధాల ఉత్పత్తిలో మొదటి స్థానం
జీవశాస్త్రాల రంగంలో భారత్ ఇప్పుడు ప్రముఖ స్థానంలో ఉంది. ప్రపంచంలో వినియోగంలో ఉన్న టీకాల్లో 62 శాతం, ఔషధాల్లో 20 శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. భారతీయ ఔషధరంగ మార్కెట్ విలువ ప్రస్తుతమున్న 4 లక్షల కోట్ల నుంచి 2025 నాటికి 7.5 లక్షల కోట్లకు చేరనుంది. కరోనా మహమ్మారి నిర్మూలనకు ఉద్దేశించిన టీకాల తయారీలో భారత్‌కు చెందిన ఏడు సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. 800 ఔషధ పరిశ్రమలతో తెలంగాణ దేశంలోనే ఔషధాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. 40 శాతం ఔషధాలు ఇక్కడే ఉత్పత్తవుతున్నాయి. ఔషధ రంగంలో అతిపెద్ద సమూహంగా 19 వేల ఎకరాల్లో హైదరాబాద్ ఔషధనగరిని ఏర్పాటు చేయడానికి తెలంగాణ సన్నద్ధమవుతోంది.
భాగస్వామిగా కేంద్ర బయోటెక్నాలజీ శాఖ
జీవఔషధ రంగంలో ఆవిష్కరణలు వెల్లువెత్తుతున్నాయి. అంకుర పరిశ్రమలు, కొత్త సంస్థలు పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నాయి. వీటిని ప్రోత్సహించి, నిలదొక్కుకునేందుకు వీలుగా చేయూతనివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన బయో ఏసియా సదస్సులో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అంకుర పరిశ్రమల కోసం బీహబ్‌ను నిర్మిస్తామని ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వినతి మేరకు కేంద్ర బయోటెక్నాలజీ శాఖ భాగస్వామిగా చేరేందుకు ముందుకొచ్చింది.