తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో నూతన జ్యుడీషియల్ జిల్లాల వ్యవస్థ.. నేడు ప్రారంభించనున్న సీజేఐ, సీఎం కేసీఆర్​

రాష్ట్రంలో నూతన జ్యుడీషియల్ జిల్లాల వ్యవస్థ నేడు ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు పాత పది జిల్లాల పరిధిలోనే రాష్ట్ర న్యాయవ్యవస్థ పనిచేస్తోంది. కొత్తగా ఏర్పడిన 33 రెవెన్యూ జిల్లాలకు అనుగుణంగా కోర్టులను విభజించారు. హైదరాబాద్ కాకుండా 32 కొత్త జ్యుడీషియల్ జిల్లాలను నేడు సాయంత్రం 5 గంటలకు హైకోర్టు ఆవరణ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్ వర్చువల్​గా ప్రారంభించనున్నారు.

32 జ్యుడిషియల్​ జిల్లాల్లో కొత్త కోర్టులు.. నేడు ప్రారంభించనున్న సీజేఐ, సీఎం కేసీఆర్​
32 జ్యుడిషియల్​ జిల్లాల్లో కొత్త కోర్టులు.. నేడు ప్రారంభించనున్న సీజేఐ, సీఎం కేసీఆర్​

By

Published : Jun 2, 2022, 4:59 AM IST

రాష్ట్రంలోని 33 జిల్లాలనూ జ్యుడిషియల్‌ జిల్లాలుగా మార్చడంతో సామాన్యులకు సత్వర న్యాయం అందుబాటులోకి రానుంది. 32 జ్యుడిషియల్‌ జిల్లాల్లో కొత్తగా జిల్లా, సెషన్స్‌ కోర్టులను గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావులు వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. గతంలో 10 జ్యుడిషియల్‌ జిల్లాలుగా జిల్లా జడ్జీల కోర్టులుండటంతో ఉమ్మడి జిల్లా కేంద్రం నుంచి దూరంగా ఉన్నవారు వ్యయప్రయాసలకోర్చి రావాల్సి వచ్చేది. ఇకముందు జిల్లా కోర్టు అందుబాటులోనే రానుండటంతో విచారణకు హాజరు కావడానికి సౌకర్యంగా ఉంటుంది. ఉమ్మడి జిల్లా కోర్టుల్లో పరిపాలనపరమైన ఇబ్బందులూ తొలగనున్నాయి. పరిపాలన వికేంద్రీకరణ జరగడంతో సత్వర నిర్ణయాలతోపాటు కేసుల విచారణ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి అవకాశాలున్నాయి. కొత్త పోస్టులతో ఉపాధి అవకాశాలూ పెరగనున్నాయి. వాస్తవానికి అన్ని జిల్లాల్లోనూ భవనాలను నిర్మించిన తరువాత కొత్త కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించింది. దీనివల్ల జాప్యం జరుగుతుందని భావించిన హైకోర్టు సూచన మేరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న భవనాల్లోనే వీటిని ప్రారంభించాలని నిర్ణయించింది.

కొన్ని జిల్లాల్లో సొంత భవనాలుండగా మరికొన్ని జిల్లాల్లో అద్దెకు తీసుకుని కోర్టులను ప్రారంభిస్తున్నారు. కొత్తగా ఏర్పాటవుతున్న కోర్టు భవనాల నిమిత్తం 21 జిల్లాల్లో 5 నుంచి 10 ఎకరాల వరకు భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం గత వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా జిల్లా కలెక్టర్లు భూమిని గుర్తించి ప్రభుత్వానికి వివరాలు పంపారు. ఈ భూమిని కోర్టు సముదాయాల నిర్మాణం కోసం కేటాయించడానికి చర్యలు తీసుకోవాలంటూ సీసీఎల్‌ఏ, కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగామ, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, మహబూబాబాద్‌, నారాయణపేట, వికారాబాద్‌, వరంగల్‌, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో 10 ఎకరాల చొప్పున, మెదక్‌లో 9.02 ఎకరాలు, రాజన్న సిరిసిల్లలో 9.38, పెద్దపల్లిలో 7, మేడ్చల్‌, నాగర్‌కర్నూల్‌, నిర్మల్‌, ములుగుల్లో 5 ఎకరాల చొప్పున, సూర్యాపేటలో 6, కుమురం భీం ఆసిఫాబాద్‌లో 2.2 ఎకరాలను కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్‌లో రూ.200 కోట్లు కేటాయించింది.

న్యాయరంగానికి పెద్దపీట..
న్యాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ సలహాలు, సూచనలతో పెనుమార్పులు తీసుకువస్తోంది. కొత్త రెవెన్యూ జిల్లాలకు అనుగుణంగా కొత్త జ్యుడిషియల్‌ జిల్లాల ఏర్పాటు ఇందులో భాగమే. గతంలో 38 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను రెగ్యులర్‌ కోర్టులుగా మార్చుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెండింగ్‌ కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాలను గుర్తించి.. వాటిలో అదనంగా కొత్త కోర్టులను మంజూరు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిసింది. గతంలో కేవలం అయిదుగురు సిబ్బందితో నడిచిన ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను రెగ్యులర్‌ చేయడంతోపాటు కొత్త జిల్లా కోర్టుల ఏర్పాటుతో వీటికి అనుగుణంగా సుమారు 1,700 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త జ్యుడిషియల్‌ కోర్టుల హోదాలను పెంచుతూ.. వాటి పేర్లను మార్చుతూ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుల పేర్లనూ మార్చుతూ ఆదేశాలు జారీ చేసింది. కొత్త కోర్టులకు సిబ్బందిని నియమించేదాకా ప్రస్తుతం ఎక్కడ ఉన్నవారు అక్కడే అదే హోదాలో పనిచేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌ మినహా 32 జ్యుడిషియల్‌ జిల్లాలకు సంబంధించి కోర్టుల పరిధులను గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి..

'భారత్​లో కూడా చైనా తరహా మిలిటరీ రూల్ కోరుకుంటున్నారా?'

ABOUT THE AUTHOR

...view details