తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. సిట్‌ విచారణ కొనసాగాల్సిందేనన్న సుప్రీంకోర్టు - Supreme reluctance to intervene in MLAs case

'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. జోక్యం చేసుకునేందుకు సుప్రీం విముఖత
'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. జోక్యం చేసుకునేందుకు సుప్రీం విముఖత

By

Published : Nov 21, 2022, 1:10 PM IST

Updated : Nov 21, 2022, 7:20 PM IST

13:04 November 21

'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. సిట్‌ విచారణ కొనసాగాల్సిందేనన్న సుప్రీంకోర్టు

'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. సిట్‌ విచారణ కొనసాగాల్సిందేనన్న సుప్రీంకోర్టు

Buying TRS MLAs Issue Update: రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిన 'ఎమ్మెల్యేలకు ఎర' కేసులో నిందితులు దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ... నిందితుల్లో ఒకరైన రామచంద్రభారతితో పాటు ఇతరులు ఇటీవల సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు రిమాండ్ రిపోర్టును తిరస్కరించగా... హైకోర్టు రిమాండ్‌కు అనుమతించిందని... ట్రయల్ కోర్టు ఆదేశాలు అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని తొలుత ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందం- సిట్‌ను నియమించగా... రాష్ట్ర హైకోర్టు సిట్ విచారణపై సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణకు ఇచ్చిన ఆదేశాలపై మరో పిటిషన్ దాఖలు చేశారు. అసలు విచారణే అవసరం లేని విషయంలో సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణ ఎందుకు అని... మొత్తం కేసు కొట్టివేయాలని సుప్రీంకోర్టుకు వారు విజ్ఞప్తి చేశారు.

సుప్రీంకోర్టులో నిందితుల వాదనను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. ఏసీబీ సెక్షన్లను మాత్రమే ట్రయల్ కోర్టు పక్కన పెట్టింది తప్పితే మొత్తం కేసును కాదని తెలిపింది. కేసులో విచారణాధికారులు సాక్ష్యాలతో సంతృప్తి పొందాలనే నిబంధన ఇక్కడ వర్తిస్తుందని గుర్తుచేసింది. ఒక పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నం చేసినట్లు అక్కడున్న సాక్ష్యాధారాలన్నీ కేసును రుజువు చేస్తున్నాయని... పోలీసులే అన్ని చూసుకుని అరెస్టు చేశారని ప్రభుత్వం తెలిపింది. తాము చేపట్టిన విచారణ స్వతంత్రంగా జరగాలనే ఉద్దేశంతోనే సిట్‌ను నియమించినట్లు చెప్పింది. హైకోర్టు సింగిల్ బెంచ్... సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఈ విచారణ జరపాలని... సీల్డ్ కవర్​లో దర్యాప్తు పురోగతి నివేదికలు ఇవ్వాలని, కాలపరిమితితో నివేదించాలని ఆంక్షలు విధించినట్లు సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వివరించింది.

రెండు పిటిషన్లపై విడివిడిగా విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌ల ధర్మాసనం... రెండింటిని కొట్టివేస్తూ వేరువేరు ఉత్తర్వులు ఇచ్చింది. నిందితులు ట్రయల్ కోర్టు రిమాండ్ రిపోర్టుపై ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోవచ్చునని... మెరిట్స్ ఆధారంగా ఉన్నత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుందని ధర్మాసనం పేర్కొంది. సిట్ విచారణ స్వేచ్ఛగా జరగాల్సిన అవసరం ఉందని... ఆంక్షలు విధించడం సరికాదని అభిప్రాయపడింది. సీల్డ్ కవర్‌లో నివేదికలు ఇవ్వాలని... సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణపై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు పక్కన పెట్టింది. అదే సందర్భంలో సింగిల్ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్ సహా... అన్నింటిని 4 వారాల్లో పరిష్కరించాలని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది.

ఇవీ చూడండి..

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. విచారణకు హాజరైన న్యాయవాది శ్రీనివాస్‌

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. గందరగోళంగా సిట్‌ నోటీసులు

Last Updated : Nov 21, 2022, 7:20 PM IST

ABOUT THE AUTHOR

...view details