asha worker died: హైదరాబాద్ మలక్‌పేట పరిధి శాలివాహననగర్‌లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న ఆశా కార్యకర్త హఠాన్మరణం చెందారు. బుధవారం ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న 35ఏళ్ల వయస్సున్న సుజాత అనే ఆశా కార్యకర్త ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంటనే ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చనిపోయిందని నిర్ధారించారు. పని ఒత్తిడితోనే సుజాత చనిపోయిందంటూ ఆరోపిస్తూ సహచర ఉద్యోగులు మృతదేహంతో ఆరోగ్య కేంద్రం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
సుజాత కుటుంబానికి న్యాయం చేయాలని సిబ్బంది డిమాండ్ చేశారు. తమపై పని ఒత్తిడి తగ్గించి తమ ఆరోగ్యం కాపాడాలని ఆశా వర్కర్లు అధికారులను వేడుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న మలక్‌పేట పోలీసులు అందోళన చేస్తున్న ఆశావర్కర్లతో పాటు వీరికి మద్దతుగా నిలిచిన ఎంఆర్‌పీఎస్ కార్యకర్తలను కూడా అరెస్టు చేశారు.