‘‘డాక్టర్.. నాకు క్యాన్సర్ వచ్చింది. చివరి దశలో ఉన్నా. ఎంతో కాలం బతకను. ఈ విషయం అమ్మానాన్నలకు చెప్పొద్దు ప్లీజ్. వారు తట్టుకోలేరు’’.. ఓ ఆరేళ్ల చిన్నారి వైద్యుడితో అన్న మాటలివి. క్యాన్సర్ సోకిందనగానే పెద్దవాళ్లే భయపడిపోతారు.. అలాంటిది ఓ పసి హృదయం తట్టుకోగలదా..? కానీ, ఆ చిన్నారి భయపడలేదు. ధైర్యంగా పోరాడాలనుకున్నాడు. కానీ, తనపైనే ఆశలు పెట్టుకున్న తన అమ్మానాన్నల గురించి బాధపడ్డాడు. అందుకే వారికి విషయం తెలియొద్దని ఇలా డాక్టర్‌ను బతిమాలాడు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డా.సుధీర్ కుమార్ ట్విటర్‌లో షేర్ చేసిన ఈ చిన్నారి కథ.. కన్నీళ్లు పెట్టిస్తోంది.
‘‘ఒక రోజు ఓపీ చూస్తుండగా.. ఓ యువ దంపతులు నా దగ్గరకు వచ్చారు. వాళ్ల ఆరేళ్ల అబ్బాయి మను బయట ఉన్నాడు. అతడికి క్యాన్సర్ అని, కానీ ఆ విషయం అతడితో చెప్పొద్దని వారు నన్ను కోరారు. ‘తనను చూడండి. చికిత్స గురించి సూచనలు చేయండి. కానీ వ్యాధి గురించి మాత్రం చెప్పకండి’ అని అభ్యర్థించారు. నేను సరే అన్నాను. ఆ తర్వాత వీల్ ఛెయిర్‌లో మనును తీసుకొచ్చారు. అతడి పెదాలపై చిరునవ్వు. ఎంతో ఆత్మవిశ్వాసంతో, తెలివైనవాడిలా కన్పించాడు. అతని మెడికల్ రిపోర్టులు పరిశీలించిన తర్వాత తెలిసిందేంటంటే.. ఆ చిన్నారికి మెదడు క్యాన్సర్ నాలుగో దశలో ఉంది. దీనివల్ల అతడి కుడి చేయి, కాలు పక్షవాతానికి గురయ్యాయి. కొంతసేపు చికిత్స గురించి మాట్లాడిన తర్వాత మను తన అమ్మానాన్నలను బయటకువెళ్లమని కోరాడు’’