ఈ వానాకాలం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. జూన్ నెలలో రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలతో వర్షాలు ఆశాజనకంగా పడటంతో రైతులు పంటలు సాగు చేశారు. గతేడాది కంటే ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం తగ్గి.. వరి పంట సాగు గణనీయంగా పెరిగిపోయింది. కాళేశ్వరం సహా పలు ప్రాజెక్టుల కింద సాగు నీటి వనరులు అందుబాటులోకి రావడం వల్ల కూడా వరి సాగు పెరిగేందుకు మరో కారణమైంది. మొత్తంగా 55 లక్షల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. ప్రధాన వాణిజ్య పంట పత్తి 70.04 లక్షల ఎకరాల్లో సాగు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా.. వర్షాభావం కారణంగా కాస్త తగ్గిపోయింది.
గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రికార్డు సాధించింది. దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. గత సీజన్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ధాన్యం దిగుబడులు, సేకరణ, మార్కెటింగ్ అంశాలపై వ్యవసాయశాఖ కసరత్తు చేస్తోంది. పెరగబోతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా గ్రామాల వారీగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, భారత ఆహార సంస్థను రంగంలోకి దింపడం ద్వారా రైతులకు కనీస మద్దతు ధరలు చెల్లించడం, నిల్వల కోసం మంచి సామర్థ్యం గల గిడ్డంగుల సమాయత్తం, అదనపు సిబ్బందిని సమీకరించడంపై ముందుస్తుగా విస్తృత కసరత్తు చేస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు.
55 లక్షల ఎకరాల్లో వరి సాగు..
తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో వరి సాగు 55 లక్షల ఎకరాలకు పెరిగిందని ప్రభుత్వం ప్రకటించింది. ఒక ఎకరానికి సరాసరి 27 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందన్న అంచనాల మేరకు 1 కోటి 48 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రాబోతోందని అంచనా వేసింది. వానాకాలం ఉత్పత్తిలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐ అంగీకరించిన దృష్ట్యా.. మరో 15 నుంచి 20 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల ఆహార అవసరాల నిమిత్తం ఏడాదికి సరాసరి వినియోగించే బియ్యం 56 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా వేసింది. అందుకోసం 83.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరం అవుతాయని తెలిపింది.