financial resources: రాష్ట్ర మంత్రివర్గం అదనపు వనరుల సమీకరణపై ప్రధానంగా చర్చించనుంది. బడ్జెట్ లో పొందిపరిచిన మేరకు రుణాల సమీకరణకు కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను రాష్ట్ర ప్రభుత్వం అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎఫ్ఆర్బీఎమ్ పరిధికి లోబడి బాండ్ల విక్రయంతో 55 వేల కోట్లు రుణాల ద్వారా సమీకరించుకోవాలని బడ్జెట్ లో ప్రతిపాదించింది. అయితే అందులో 19 వేల కోట్లను కేంద్రం కోత విధించింది. వాటితో పాటు కేంద్ర నిబంధనలు, ఆంక్షల కారణంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకుంటున్న రుణాలు రాకుండా పోయాయి. దీంతో కాళేశ్వరం, జలవనరుల అభివృద్ధి, రహదారి అభివృద్ధి సంస్థ, గృహ నిర్మాణ సంస్థ, జలమండలి, ఆర్టీసీ తదితరాలు అప్పులు తీసుకునే అవకాశం లేక ఆయా పనులకు ఇబ్బంది ఏర్పడింది. దీంతో వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అదనపు వనరుల సమీకరణ కార్యాచరణ అమలు చేస్తోంది. ఆర్థికశాఖా మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఇందుకు సంబంధించి కొంత కసరత్తు చేసింది. నిరుపయోగంగా ఉన్న భూముల అమ్మకం, రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల విక్రయం, తదితరాలపై చర్చించి కొంత అమలు చేశారు.
అదనపు వనరుల సమీకరణపై మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. ఖజానాకు పన్నుల ద్వారా ఆదాయం ఆశించిన మేర ఉంది. 2022-23 లో లక్షా 8 వేల కోట్ల రూపాయలు పన్నుఆదాయంగా అంచనా వేయగా... మొదటి త్రైమాసికంలో 25 శాతం మేర 27 వేల కోట్లు సమకూరాయి. పన్నేతర రాబడి కూడా బాగానే ఉంది. 25 వేల కోట్లు అంచనా వేయగా మొదటి మూడు నెలల్లో 27 శాతం మేర 6874 కోట్లు సమకూరాయి. జూన్ నెలలో పన్నేతర ఆదాయం 5వేల కోట్లకు పైగా సమకూరింది. భూముల అమ్మకం ద్వారా 15వేల కోట్లు సమకూర్చుకోవాలని అంచనా వేశారు. ఇటీవల కోకాపేట, ఇతర ప్రాంతాల్లో భూముల అమ్మకం ద్వారా ఖజానాకు 4 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. గనుల శాఖ ఆదాయంతో పాటు ఇతర పన్నేతర ఆదాయ అంచనాలను పెంచుకునే విషయమై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖ ద్వారా గరిష్ట ఆదాయాన్ని రాబట్టుకోవడంతో పాటు బకాయిల వసూళ్లకు సర్కార్ ఇప్పటికే కార్యాచరణ చేపట్టింది. సొంత రాబడులను మరింతగా పెంచుకునేలా ఆయా శాఖల అంచనాలను కూడా సవరించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది.
అప్పులపై కేంద్రం ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి - restrictions on loans
financial resources : రాష్ట్ర ప్రభుత్వం అదనపు ఆర్థిక వనరుల సమీకరణపై దృష్టి సారించింది. అప్పులపై కేంద్రం ఆంక్షలు విధించిన వేళ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇవాళ జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో అదనపు వనరుల సమీకరణపై ప్రధానంగా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోనున్నారు. సొంత రాబడులు పెంచుకునే కార్యాచరణను అమలు చేయనున్నారు.

పన్నుల వసూళ్లలో లీకేజీలు అరికట్టడం, వ్యవస్థను పటిష్ఠం చేయడం, న్యాయపరమైన వివాదాలను త్వరగా పరిష్కరించుకునేలా తగిన చర్యలు సహా వివిధ అంశాలను మంత్రివర్గంలో పరిశీలించనున్నారు. పెండింగ్‌లో ఉన్న కొత్త మైనింగ్ విధానంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రుణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరి, తదుపరి కార్యాచరణపై కూడా కేబినెట్‌లో చర్చ జరగనుంది. ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి తీసుకునే అప్పులతో పాటు కార్పొరేషన్ల రుణాలకు ఆయా ఆర్థికసంస్థలు తీసుకొచ్చిన కొత్త నిబంధనలు, సంబంధిత అంశాలపై మంత్రివర్గంలో చర్చించి తదుపరి అనుసరించాల్సిన కార్యాచరణపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.
ఇవీ చదవండి:ప్రారంభమైన మంత్రివర్గ భేటీ.. వాటిపైనే చర్చించే అవకాశం..!
'ఎన్నికల్లో ఉచితాల'పై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. పార్టీ గుర్తింపు రద్దుపై..