దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ఈ ఏడాది లక్ష శ్రీ గంధం మొక్కలు నాటాలని అటవీ అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. తొలిదశలో రంగారెడ్డి జిల్లా పరిధిలో ఎదుగుదల తగ్గిపోయిన నీలగిరి చెట్లను తొలగించి.. వాటి స్థానంలో శ్రీ గంధం మొక్కలు నాటాలని తీర్మానించారు. సిద్దిపేట జిల్లా ములుగు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీలో పెంచిన 3లక్షల మొక్కల నుంచి లక్ష మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అధిక లాభాల కోసం..
భవిష్యత్తులో అధిక ఆదాయాన్ని ఇచ్చే చెట్లను పెంచాలని లక్ష్యంతో అటవీ అభివృద్ధి సంస్థ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. విలువైన గంధాన్ని అందించే మొక్కలను దీర్ఘకాలిక దిగుబడితో పాటు అధిక లాభాలు గడించాలని చూస్తున్నారు. ప్రాంతీయ రింగ్ రోడ్డు పరిధిలోని నీలగిరి చెట్లను తొలగించి వాటి స్థానంలో శ్రీ గంధం మొక్కలు నాటేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి తీసుకోవాల్సిన అంశాలపై 15 రోజుల కిందట ములుగులోని ఉద్యాన శాఖకు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సీలో అటవీ అభివృద్ధి సంస్థ అధికారులకు శిక్షణా తరగతులు సైతం నిర్వహించారు.
రింగ్ రోడ్డు సమీపంలో..
అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాజధాని చుట్టూ ఉన్న రింగ్ రోడ్డు సమీపంలో సుమారు పదిహేను వందల హెక్టార్ల విస్తీర్ణంలో నీలగిరి చెట్లు పెంచుతున్నారు. కాగితం తయారీకి ఉపయోగపడే వీటిని నాలుగేళ్లపాటు పెంచిన తర్వాత కొట్టేసి పరిశ్రమకు విక్రయించడం ద్వారా ఆదాయం వస్తుంది. 20 ఏళ్లు దాటిన తర్వాత వాటి పెరుగుదల తగ్గుతుంది. అలాంటి చెట్లను తొలగించాలని అధికారులు నిర్ణయించారు.