పాలసీదారు ఆరోగ్య వివరాలన్నీ వెల్లడించలేదన్న ఏకైక కారణంతో బీమా పరిహారాన్ని తిరస్కరించకూడదని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ స్పష్టం చేసింది. అందులోనూ పాలసీదారు వెల్లడించని అనారోగ్య కారణంతో కాకుండా గుండెపోటుతో మృతి చెందినప్పుడు పాలసీ సొమ్మును తిరస్కరించడం చెల్లదంది. వరంగల్ జిల్లాకు చెందిన సమ్మక్క 2013 ఫిబ్రవరి 4న రూ.11,966 ప్రీమియాన్ని చెల్లించి ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో రూ.1.57 లక్షలకు పాలసీ తీసుకున్నారు. అదే ఏడాది ఆగస్టు 29న చనిపోగా నామినీగా ఉన్న కుమారుడు అజ్మీరా సమ్మయ్య బీమా సొమ్ము కోసం సంస్థను ఆశ్రయించారు. అనారోగ్యాన్ని వెల్లడించకుండా పాలసీ తీసుకున్నందున తిరస్కరిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. దీనిపై సమ్మయ్య జిల్లా ఫోరంను ఆశ్రయించగా రూ.1.57 లక్షలు 7.5 శాతం వడ్డీతో చెల్లించడమే కాకుండా రూ.20 వేలు ఖర్చులకు ఇవ్వాలని తీర్పు వెలువరించింది.
ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు
దీనిపై బీమా కంపెనీ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో అప్పీలు చేసింది. కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ ఎమ్మెస్కే జైశ్వాల్, సభ్యురాలు మీనా రామనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పాలసీదారుకు డయాబెటీస్ ఉందని.. ఇన్సులిన్ తీసుకుంటూ, ఆ విషయాన్ని దాచిపెట్టి పాలసీ తీసుకున్నందువల్ల క్లెయిమ్‌ను తిరస్కరించినట్లు తెలిపింది. ‘‘పాలసీ తీసుకోకముందు నెల నుంచే ఆమె ఇన్సులిన్ ఆపేశారు. అంతేగాకుండా డయాబెటీస్ వల్ల పాలసీదారు చనిపోలేదు. గుండెపోటు వల్ల చనిపోయిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. దీర్ఘకాలంగా డయాబెటీస్‌తో బాధపడుతున్నందువల్ల గుండెపోటు వచ్చిందనడానికి బీమా కంపెనీ ఎలాంటి ఆధారాలు సమర్పించలేదు’’ అంటూ కొట్టివేసింది. జిల్లా ఫోరం తీర్పు ప్రకారం పాలసీదారు కుమారుడికి రూ.1.57 లక్షలను 7.5 శాతం వడ్డీతో చెల్లించాలని ఆదేశించింది.
కారు మరమ్మతు ఖర్చులతోపాటు పరిహారం చెల్లించాల్సిందే
అకాల వర్షాలతో పాడైన కారు మరమ్మతు ఖర్చులతోపాటు పరిహారంగా రూ.50 వేలు చెల్లించాలంటూ ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. కూకట్‌పల్లికి చెందిన బి.విశ్వనాథరెడ్డి బంజారాహిల్స్‌లోని టాటా మోటార్స్ నుంచి 2009లో కారు కొన్నారు. 2010లో అకాల వర్షాలతో ఇంజిన్‌లోకి నీరు వెళ్లి పాడైంది. వర్క్‌షాపునకు తీసుకెళ్లగా రూ.1.07 లక్షలకు అంచనా వేసింది. క్లెయిమ్ చేయగా ఫిర్యాదుదారు నిర్లక్ష్యం అంటూ బీమా కంపెనీ తిరస్కరించింది. ఆధారాలను పరిశీలించిన జిల్లా ఫోరం మరమ్మతు ఖర్చులతోపాటు రూ.50 వేలు పరిహారంగా చెల్లించాలంటూ తీర్పు వెలువరించింది. దీనిపై ఇన్సూరెన్స్ కంపెనీ రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌లో అప్పీలు చేయగా కొట్టివేసింది. జిల్లా ఫోరం తీర్పులో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు లేవని స్పష్టం చేసింది.