కృష్ణా బోర్డు నిర్వహణలో శ్రీశైలం ప్రాజెక్టు అత్యంత కీలకం కానుంది. సుమారు 400 టీఎంసీలతో 45 లక్షల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉన్న ప్రాజెక్టులు శ్రీశైలంపై ఆధారపడి ఉండగా, ఇందులో ఒకటి మినహా మిగిలినవన్నీ మిగులు జలాలపై ఆధారపడి ఉన్నవే. ప్రస్తుతానికి తెలంగాణలో 200 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌లో 200 టీఎంసీల వినియోగానికి తగ్గట్లుగా ప్రాజెక్టులు వినియోగంలోనూ, నిర్మాణంలోనూ ఉండగా.. మరింత వరద నీటిని తీసుకెళ్లేలా ఆంధ్రప్రదేశ్ విస్తరణ పనులు చేపట్టింది. ఈ విస్తరణతో సంబంధం లేకుండా ప్రస్తుతం ఉన్న సామర్థ్యం ప్రకారమే రోజూ 90 వేలకు పైగా క్యూసెక్కుల నీటిని తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ వైపు 59,100 క్యూసెక్కులు కాగా, తెలంగాణ వైపు 31,200 క్యూసెక్కులు. శ్రీశైలం నుంచి తీసుకునే నీటిలో 34 టీఎంసీలకు మాత్రమే కేటాయింపు ఉంది. మిగిలినదంతా మిగులు జలాలపైనే ఆధారం.
గత ఏడు సంవత్సరాల్లో రెండేళ్లలోనే మెరుగైన ప్రవాహం
వరద వచ్చినపుడు కాకుండా.. సీజన్ ఆరంభంలో ఆయా ప్రాజెక్టుల అవసరాలకు తగ్గట్లుగా నీటిని విడుదల చేయడం, నిర్వహించడం బోర్డుకు సవాలుగా మారే అవకాశం ఉంది. గత కొన్నేళ్లుగా ప్రత్యేకించి ఆలమట్టిలో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం ప్రారంభమైన తర్వాత జూన్, జులై నెలల్లో శ్రీశైలంలోకి వచ్చే ప్రవాహం చాలా తక్కువ. 2014-15 నుంచి ఏడు సంవత్సరాలకుగాను రెండేళ్లలో మాత్రమే ప్రవాహం మెరుగ్గా ఉంది. ఆగస్టులో ప్రవాహం మొదలైనా శ్రీశైలం దిగువన ఉన్న ప్రాజెక్టుల అవసరాలను మొదట పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దిగువన నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరులలో వరద వచ్చిన రోజుల్లో మాత్రమే ఎక్కువ నీటిని మళ్లించాల్సి వస్తుంది. మొత్తం పంట కాలానికి రోజూ నీటిని ఎత్తిపోసే ఎత్తిపోతల పథకాలకు ఇది సాధ్యం కాదు. అలాగే సొరంగాలు కూడా.
కృష్ణా జలవివాద ట్రైబ్యునల్-2 ఆలమట్టి ఎత్తును పెంచడానికి అంగీకరించడంతో పాటు మరో 130 టీఎంసీలు ఈ ప్రాజెక్టులో అదనంగా కేటాయించింది. సుప్రీంకోర్టులో కేసు కారణంగా ఈ తీర్పును కేంద్రం ఇంకా నోటిఫై చేయలేదు. ఇది అమలులోకి వస్తే శ్రీశైలంలోకి నీటి ప్రవాహం చేరడంలో మరింత జాప్యమవుతుంది. ప్రాజెక్టుపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. రెండు రాష్ట్రాలకు శ్రీశైలం కీలకమైన ప్రాజెక్టు కాగా, బోర్డు నిర్వహణలో దీనికి అత్యంత ప్రాధాన్యం ఉంది. రెండువైపులా విద్యుదుత్పత్తి ఉండగా, ఈ రెండింటికి కనీస నీటిమట్టం దిగువన తీసుకోవడానికి అవకాశం ఉంది.