తెలంగాణ

telangana

ETV Bharat / state

'హరిత తెలంగాణ-ఆరోగ్య తెలంగాణ'.. ఆరోవిడతలో సర్కార్ నిర్ణయం - ఆరో విడత హరితహారం కార్యక్రమం వార్తలు

ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా.. మరో విడత హరితహారానికి రంగం సిద్ధమవుతోంది. ఈనెల 25 నుంచి ఆరో విడత మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ దఫాలో 30 కోట్లకు పైగా మొక్కలు నాటి.. సంరక్షించాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకొంది. ఇందులో పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధి సహా యాదాద్రి నమునాలో చిట్టడవుల పెంపునకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

the-sixth-phase-of-haritha-haram-programme-is-to-be-launched-in-the-state
'హరిత తెలంగాణ-ఆరోగ్య తెలంగాణ' ధ్యేయంగా ఆరోవిడత హరితహారం

By

Published : Jun 18, 2020, 3:22 PM IST

పచ్చదనం పెంపు ధ్యేయంతో 2015 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితహారం పేరిట బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రంగారెడ్డి జిల్లా చిల్కూర్ బాలాజీ సన్నిధిలో మొక్కలు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలను నాటారు. 5 విడతల కార్యక్రమం అమలు, అనుభవాల నేపథ్యంలో ఆరో విడత హరితహారం కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ నెల 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

ఆరో విడతలో భాగంగా 30 కోట్లకు పైగా మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పచ్చదనం పెంపు అంశాన్ని పంచాయతీరాజ్, పురపాలిక చట్టాల్లో ప్రత్యేకంగా పేర్కొన్న ప్రభుత్వం.. అన్ని స్థానిక సంస్థల్లోనూ విధిగా 10 శాతం బడ్జెట్​ను 'గ్రీన్ బడ్జెట్' పేరిట కేటాయించాలని స్పష్టం చేసింది. నాటిన మొక్కల్లో కనీసం 85 శాతం బతకకపోతే సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులపై చర్యలు తీసుకునే అధికారాన్నీ ఈ చట్టంలో పొందుపర్చింది.

ఆరో విడతలో కొన్నింటిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించనున్నారు. 'జంగల్ బచావో-జంగల్ బడావో' నినాదానికి అనుగుణంగా ఆటవీ ప్రాంతాల్లో మొక్కలు నాటి.. సంరక్షణా చర్యలు చేపట్టనున్నారు. ఈ విడతలో టేకు, సరుగుడు, చింత, పూలు, పండ్ల మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రతీ జిల్లాలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో యాదాద్రి నమూనాలో మియావాకీ పద్ధతిలో తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలతో చిట్టడవులను అభివృద్ధి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

'హరిత తెలంగాణ-ఆరోగ్య తెలంగాణ' రాష్ట్ర సాధనే లక్ష్యంగా చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో ప్రత్యేకంగా హరితహారం కార్యక్రమం చేపడతారు. పట్టణ ప్రాంత వాసులకు స్వచ్ఛమైన గాలిని అందించే ఆక్సిజన్ కర్మాగారాలుగా పనిచేసేలా.. 95 అర్బన్ ఫారెస్ట్ బ్లాకుల అభివృద్దిని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే చేపట్టింది. ఇందులో ఇప్పటికే 35 పూర్తి కాగా.. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.

ఆరో విడత హరితహారం కోసం ఆయా శాఖలు ఇప్పటికే కసరత్తు వేగవంతం చేశాయి. మంత్రులు, ఉన్నతాధికారులు గత కొన్నాళ్లుగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రణాళికలను సమీక్షిస్తున్నారు. కరోనా నేపథ్యంలో కొవిడ్ నిబంధనలకు లోబడి హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇదీచూడండి: హైదరాబాద్‌కు పచ్చని తోరణాలు.. 300 ట్రీ పార్కులకు ప్రణాళికలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details