ఎమ్మెల్యేలకు ఎర కేసు.. విచారణ వేగవంతం చేసిన సిట్.. కస్టడీ పిటిషన్ కొట్టివేత TRS MLAs Poaching Case Update: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన.. తెరాస ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని విచారించిన సిట్ అధికారులు.. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు నోటీసులు జారీ చేశారు. 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీచేసిన అధికారులు.. ఈనెల 29న సిట్ ఎదుట హాజరుకావాలని పేర్కొన్నారు. ఇదే కేసులో న్యాయవాది ప్రతాప్‌ను అరెస్ట్ చేయవద్దని సిట్‌ను ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం విచారణకు హాజరుకావాలని ఈనెల 22న ప్రతాప్‌నకు సిట్ నోటీసులు జారీ చేసింది. వాటిని సవాల్ చేస్తూ ప్రతాప్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు.
ఆదేశాలు ఇచ్చే వరకూ అరెస్టు చేయవద్దు : నిందితుడు, అనుమానితుడిగా లేకపోయినా సీఆర్పీసీ 41ఏ నోటీసు ఇవ్వడం సుప్రీంకోర్టు తీర్పు, చట్టాలకు విరుద్ధమని... పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. నోటీసుల్ని రద్దు చేయాలని.. శుక్రవారం విచారణకు హాజరుకావల్సిన అవసరం లేకుండా... మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. తగిన కారణాలున్నందునే ప్రతాప్‌నకు సిట్ నోటీసులిచ్చిందని ప్రస్తుత దశలో ఆధారాలు చూపలేరని ఏజీ, అదనపు ఏజీ వివరించారు. ప్రతాప్ విచారణకు హాజరు కాకపోతే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందన్నారు. విచారణ ఆలస్యమైతే ప్రతాప్ మొబైల్ ఫోన్లో సమాచారం తొలగించే ప్రమాదం ఉందని కోర్టుకు వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు నోటీస్ రద్దు చేసేందుకు నిరాకరిస్తూ శుక్రవారం విచారణకు హాజరుకావాలని ప్రతాప్‌ని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ అరెస్టు చేయవద్దని.. నోటీసు నిబంధనలకు కట్టుబడి లేకపోతే.. మళ్లీ హైకోర్టును ఆశ్రయించవచ్చునని సిట్ కు స్వేచ్చనిచ్చింది.
సిట్ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్ కొట్టివేత :కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ... సిట్ వేసిన పిటిషన్‌ను అనిశా న్యాయస్థానం కొట్టివేసింది. ముగ్గురు నిందితుల నుంచి... మరింత సమాచారం సేకరించాల్సి ఉందని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దర్యాప్తులో భాగంగా కొంత సమాచారం లభించిందని... నిందితులను ప్రశ్నించి స్పష్టత తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ఇదివరకు కేవలం 2 రోజులు మాత్రమే కస్టడీకి ఇవ్వడంతో పూర్తిస్థాయిలో ప్రశ్నించలేకపోయామని.. మరో ఐదురోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఆ వాదనతో... నిందితుల తరపు న్యాయవాది వ్యతిరేకించారు. ముగ్గురు ఇప్పటికే 25రోజులుగా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారని పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసుతో వారు బాధితులయ్యారని కోర్టుకు వివరించారు. బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టు హైకోర్టుకు సూచించిందని ఈ తరుణంలో కస్టడీకి ఇవ్వవద్దని నిందితుల తరఫు న్యాయవాది... కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం సిట్ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను కొట్టివేసింది.
మరో నలుగురు నిందితులుగా : ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ... ప్రత్యేక కోర్టుకు సిట్ మెమో దాఖలు చేసింది. ఇందులో భాజపా జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్‌ను... నాలుగో నిందితుడిగా పేర్కొంది. తుషార్‌ను ఐదో నిందితుడిగా చేర్చిన సిట్.. కేరళవాసి జగ్గుస్వామిని ఆరో, కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌ని ఏడోవ నిందితుడిగా చేరుస్తూ... అనిశా ప్రత్యేక కోర్టులో సిట్ మెమో దాఖలు చేసింది. కేసులో నిందితులైన రామచంద్రభారతి, సింహయాజి, నందులకు స్వర నమూనాపై ఎఫ్ఎస్ఎల్ తన నివేదికను సిట్‌కు అందించింది.
ఇవీ చదవండి: