Sirpurkar Commission: దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఏర్పాటైన సిర్పూర్కర్ కమిషన్ నేడు క్షేత్రస్థాయిలో పర్యటించనుంది. షాద్నగరం మండలం చటాన్పల్లితో పాటు పోలీస్ స్టేషన్, ఆస్పత్రి, నిందితులను ఉంచిన గెస్ట్ హౌజ్‌ను కమిషన్ పరిశీలించే అవకాశం ఉంది. దిశ హత్యాచారం జరిగిన ఘటనా స్థలాన్ని త్రిసభ్య కమిషన్ పరిశీలించే అవకాశం ఉంది. సిర్పూర్కర్ కమిషన్ ఇప్పటి వరకు పలువురిని విచారించింది. ఆగస్టు 21న ప్రారంభమైన సిర్పూర్కర్ కమిషన్ విచారణ, నవంబర్ 25వ తేదీ వరకు కొనసాగింది.
హోంశాఖ కార్యదర్శి రవిగుప్తతో విచారణ మొదలుపెట్టిన కమిషన్ సభ్యులు.. ఆ తర్వాత సిట్ దర్యాప్తు అధికారి సురేందర్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించారు. ఆ తర్వాత మహేశ్ భగవత్, సజ్జనార్, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి, ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసులను కమిషన్ ప్రశ్నించింది. పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులను అడిగి వివరాలు తెలుసుకుంది. చటాన్‌పల్లిలో ఎన్ కౌంటర్ జరిగిన తర్వాత శవపంచనామా నిర్వహించిన అధికారులను ప్రశ్నించింది. మృతుల కుటుంబ సభ్యుల నుంచి సాక్ష్యం నమోదు చేసింది. అఫిడవిట్లు దాఖలు చేసిన మానవ హక్కుల సంఘాలకు చెందిన వాళ్లను ప్రశ్నించింది.