దిశ ఎన్కౌంటర్(Disha Encounter)లో తమ కుమారుడు చనిపోయాడని... తగిన న్యాయం చేయాలని మృతుడు ఆరిఫ్ తండ్రి హుస్సేన్, సిర్పూర్కర్ కమిషన్‌ను కోరారు. నష్ట పరిహారం కోసమే అఫిడవిట్ దాఖలు చేశారా అని ప్రభుత్వ తరఫు న్యాయవాది ఉమామహేశ్వర్ రావు అడిగిన ప్రశ్నకు... న్యాయం కోసమే కమిషన్‌ను ఆశ్రయించినట్లు హుస్సేన్ తెలిపారు.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ ఘటనపై సిర్పూర్కర్ కమిషన్ (Sirpurkar Commission) విచారణ నిర్వహించింది. ఈనెల 1న మొదలైన మలి విడత విచారణ శనివారం వరకు కొనసాగింది. సిట్ అధికారి సురేందర్ రెడ్డితో పాటు సాక్షిగా వ్యవహరించిన ప్రభుత్వ ఉద్యోగి రాజశేఖర్‌ను కమిషన్ ప్రశ్నించింది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు హుస్సేన్‌ను ప్రభుత్వ తరఫు న్యాయవాది ఉమా మహేశ్వర్ రావు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు.
ఉమామహేశ్వర్ రావు అడిగిన పలు ప్రశ్నలకు హుస్సేన్ చెప్పిన సమాధానాలను కమిషన్ నమోదు చేసుకుంది. ఈనెల 13 నుంచి 17 వరకు మరోసారి విచారణ నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. మృతుల కుటుంబ సభ్యుల్లో ఆరిఫ్ తండ్రి హుస్సేన్ నుంచి మాత్రమే కమిషన్ వాంగ్మూలం తీసుకుంది. మిగతా ముగ్గురు మృతుల కుటుంబ సభ్యుల నుంచి వాంగ్మూలం నమోదు చేయాల్సి ఉంది.