చదువు'కొనే' పరిస్థితి వచ్చింది: లక్ష్మణ్ - corporate organosations
తెరాస ప్రభుత్వం వచ్చాక చదువు కొనే పరిస్థితి ''వచ్చిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ విమర్శించారు. కార్పొరేటు శక్తుల ఆగడాలను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను తెరాస ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు డా.కె లక్ష్మణ్ ఆరోపించారు. హైదరాబాద్ నాంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో మార్గదర్శిని స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. రాష్ట్రం ఏర్పడక ముందు, తర్వాత.. అక్షరాస్యత శాతం 66గానే ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలను నియంత్రిస్తానన్న ముఖ్యమంత్రి కేసీఆర్... పుట్టగొడుగుల్లా వెలుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. విద్యను వ్యాపారం చేసి.. లక్షల్లో ఫీజులు వసూళ్లు చేస్తున్న ప్రైవేటు సంస్థలపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.