ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు...! ముంచెత్తుతున్న వర్షాలు
రాష్ట్రంలోని పలు ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. పలుచోట్ల కుంభవృష్టి మాదిరిగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ 24 గంటల వ్యవధిలో వెంకటాపూర్‌లో 22 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
జలపాతాలకు భారీగా చేరుతున్న వరద నీరు
ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో వానలు జోరుగా కురుస్తున్నాయి. చాలా వరకు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాలకు తోడు... ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా... నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం, బోథ్ మండలంలోని పొచ్చర జలపాతాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.
ఉప్పొంగి ప్రవహిస్తున్న కడెం నది
కురుస్తున్న వర్షాలతో కడెం నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. నేరడిగొండ మండలం వెంకటాపురానికి చెందిన ఓ వ్యక్తి కడెం నదిలో చిక్కుకుపోయాడు. అతని అరుపులు విన్న స్థానిక జాలర్లు వెంటనే కాపాడారు. ఆసిఫాబాద్‌లోని కుమురం భీం ప్రాజెక్టు ఐదు గేట్లు ఎత్తి దిగువకు 10 వేలకు పైగా క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ముథోల్‌లో పాక్షికంగా దెబ్బతిన్న 9 ఇళ్ళు
ఎడతెరిపిలేని వర్షాల వల్ల ముథోల్‌లోని 9 ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొన్ని నివాసాలు కూలిపోయాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్‌లోని ఓ ఇల్లు పైకప్పు కూలి ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
భద్రాచలం వద్ద గోదావరి వరద ఉగ్రరూపం
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ గ్రామీణ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ ఏడాదిలోనే ఇక్కడ గరిష్ఠ వరద నమోదైంది.
జూరాలకు పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ
ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి కృష్ణమ్మ జూరాలకు పరవళ్లు తొక్కుతోంది. జూరాలకు నుంచి 23 గేట్లు ఎత్తి దిగువ శ్రీశైలానికి 2లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం... 9.6 టీఎంసీలు కాగా.... ప్రస్తుతం 9.296 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
ఇవీ చూడండి: హయత్‌నగర్ కిడ్నాపర్‌కు 18 ఏళ్ల నేర చరిత్ర