హైదరాబాద్ ఎర్రమంజిల్ పౌరసరఫరాల శాఖ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రసంగించారు. నిన్న మంత్రి కేటీఆర్‌తో కలిసి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు పరిశీలించామని ఆయన అన్నారు. నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని సూచించారన్నారు. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో రబీ సీజన్‌లో రైతులు 1152, 1156 వరి రకాలు సాగు చేయడం వల్ల అగ్గితెగులు, మెడవిరుపు కనిపిస్తుందని చెప్పారు. జిల్లాలో 215 ధాన్యం కొనుగోలు కేంద్రాలకుగాను ఇప్పటి వరకు 206 కేంద్రాలు తెరిచామని చెప్పారు.
సమస్యలున్న మాట వాస్తవం...
కొనుగోలు కేంద్రాల్లో తేమ, తాలు, లారీలు, రవాణా, మిల్లర్ల సమస్యలున్న మాట వాస్తవమేనన్నారు. వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. చిన్న విషయాలు ఆసరాగా తీసుకుని ఇబ్బందులు సృష్టిస్తే రైస్ మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు. రైతులు తొందరపడి ధాన్యం అమ్ముకోవద్దన్నారు. బయట అమ్ముకోవాల్సి వస్తే కనీస మద్దతు ధరకే అమ్ముకోవాలన్నారు. లేనిపక్షంలో ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల్లోనే విక్రయించుకోవాలని శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.