అసెంబ్లీలో పీఆర్సీ సిఫారసులపై సీఎం కేసీఆర్ ప్రకటనలకు అనుగుణంగా నూతన వేతనాల అమలుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు వెంటనే విడుదల చేసి... మే నెల నుంచి నూతన వేతనాలు పొందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ... ఉద్యోగుల ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఈ-మెయిల్ ద్వారా వినతిపత్రం అందజేశామని ఐక్య వేదిక కమిటీ వెల్లడించింది.
'పీఆర్సీ కొత్త వేతనాలు మే నుంచి అమలు చేయాలి' - telangana news today
రాష్ట్రంలో నూతన పీఆర్సీ వేతనాలు మే నెల నుంచి విడుదల చేయాలని ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ సీఎస్‌కు మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేసింది. సీఎం కేసీఆర్ మార్చి 22న అసెంబ్లీలో నూతన పీఆర్సీ గురించి ప్రకటన చేశారని... ఏప్రిల్ నెల నుంచే వేతనాలు ఇస్తామని చెప్పినా... ఇప్పటివరకు అమలు కాలేదన్నారు. వచ్చే నెల నుంచి ఆ వేతనాలు అమలు చేయాలని సోమేశ్‌కుమార్‌ను కోరారు.
ఉద్యోగుల వేతన సవరణపై సీఎం కేసీఆర్ మార్చి 22న అసెంబ్లీలో ప్రకటన చేశారని ఐక్యవేదిక సభ్యులు తెలిపారు. మే 1న పొందే ఏప్రిల్ నెల వేతనాలు నూతన పీఆర్సీ ప్రకారమే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పొందుతారని సీఎం ప్రకటించారని ఐక్య వేదిక సభ్యులు గుర్తుచేశారు. కానీ.. ఏప్రిల్ నెల ముగింపుకొచ్చినప్పటికీ ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు కాలేదని అన్నారు. 1 జూలై 2018 నుంచి అమలు కావలసిన వేతనాల సవరణ 33 నెలలు ఆలస్యం అయిందని... ఇప్పటికీ మధ్యంతర భృతి కూడా ఇవ్వలేదని ఐక్య వేదిక నేతలు పేర్కొన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి ప్రకటనకు అనుగుణంగా కనీసం పీఆర్సీ అమలుకు సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేయాలని ఈ-మెయిల్ ద్వారా కోరామన్నారు.
ఇదీ చూడండి :కర్ఫ్యూ తర్వాత ఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి: హైకోర్టు