ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల నిరీక్షణ సోమవారం ఫలించే అవకాశం కనిపిస్తోంది. వేతన సవరణపై త్వరలోనే ప్రకటన చేస్తానని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానం ఇచ్చిన సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో బడ్జెట్ ప్రసంగంలో, కేటాయింపుల్లో పీఆర్సీ ప్రస్తావన ఎక్కడా చేయలేదు. అటు నాగార్జునసాగర్ ఉపఎన్నిక నేపథ్యంలో వేతన సవరణ ప్రకటించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది. ప్రభుత్వ విజ్ఞప్తిపై స్పందించిన ఈసీ.. పీఆర్సీ ప్రకటనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపింది.
ఎన్నికల సంఘం అనుమతి నేపథ్యంలో వేతన సవరణ సహా సంబంధిత అంశాలపై ప్రకటన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఉద్యోగ సంఘాల నేతలు, అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్లో ఆదివారం మరోమారు సమావేశమయ్యారు. పీఆర్సీ, పదవీ విరమణ వయస్సు పెంపు సహా ఇతర అంశాలపై చర్చించారు. ఇందుకు సంబంధించి శాసనసభలో ఇవాళ సీఎం కేసీఆర్ ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.