దాణా ధరలు పెరగడం వల్ల కోళ్ల పరిశ్రమ కష్టాలు ఎదుర్కొంటోంది. గతేడాది కిలో రూ.14 ఉన్న మొక్కజొన్న ధర ఈ ఏడాది కిలోకు రూ.26 వరకు పెరిగింది. కోళ్లకు దాణాగా వేసే సోయాబీన్, నూకలు, తౌడు ధరలు ఎగబాకాయి. ఈకారణంగా గ్రామీణ కోళ్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. నెల రోజుల వ్యవధిలోనే చికెన్ ధరలు కిలోకు రూ.40పైగా పెరగడం గమనార్హం. దసరా ముందు వరకు రూ.180 ఉన్న స్కిన్‌లెస్ చికెన్ ధర ప్రస్తుతం రూ.210 నుంచి రూ.220 వరకు పలుకుతోంది.
కిలో దాణా ఖర్చు రూ.36
కోడి 2 కిలోల వరకు పెరగడానికి 4 కిలోల దాణా అవసరం. పెరిగిన ధరలతో కిలో దాణాకు రూ.36 ఖర్చవుతోంది. ఒక్కో కోడి రెండు కిలోలు పెరిగేందుకు మేత ఖర్చే రూ.144. ఒక కోడి కిలో పెరగడానికి రైతులకు రూ.85 వరకు అవుతోంది. ప్రస్తుతం లైవ్ చికెన్ కేజీకి రూ.102 నుంచి రూ.105 వరకు ఉంది. స్కిన్‌తో అయితే 33 శాతం, స్కిన్ లేకుండా 40శాతం (తరుగు) వేస్టేజి కింద పోతుంది. అంటే కిలో కోడి.. మాంసంగా మారేసరికి 600 గ్రాములవుతోంది.