TSLPRB on pregnant woman: గర్భిణులు, బాలింతలు ఎస్సై, కానిస్టేబుల్ స్థాయి శారీరక సామర్థ్య పరీక్షల్లో పాల్గొనకున్నా.. తుది రాతపరీక్ష అర్హత పొందాలంటే అండర్ టేకింగ్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక మండలి స్పష్టం చేసింది. తుది రాతపరీక్షలో అర్హత సాధిస్తే పరీక్ష ఫలితాలు వెల్లడైన నెల రోజుల్లోపు శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరవుతామని గర్భిణీలు, బాలింతలు లిఖితపూర్వకంగా ధ్రువీకరించాల్సి ఉంటుందని మండలి ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఆ హామీపత్రాన్ని ధృవీకరించి.. ఈ నెల 31లోగా డీజీపీ కార్యాలయంలోని టీఎస్ఎల్పీఆర్బీ ఇన్ వార్డ్ సెక్షన్లో నేరుగా సమర్పించాలని పోలీస్ నియామక మండలి సూచించింది. తుది ఫలితాల్లో అర్హత సాధించి పోలీస్ ఉద్యోగానికి ఎంపికయ్యే గర్భిణీలు ధృవీకరణ పత్రంతో పాటు.. వైద్యులతో మెడికల్ సర్టిఫికెట్ తీసుకురావాలని తెలిపారు. తుదిఫలితాలు వెల్లడైన తేదీ నుంచి.. నెల రోజుల్లోపు దేహాదారుడ్య పరీక్షల్లో పాల్గొంటామని హామీ పత్రమివ్వాలని తెలిపారు.
దేహదారుడ్య పరీక్షలపై పలువురు గర్భిణిలు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు గర్బిణీలకు పోలీసు నియామక మండలి కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ప్రస్తుతం గర్బిణీ, బాలింతగా ఉంటే దేహదారుఢ్య పరీక్షలో అర్హత సాధించడం కష్టంకావడంతో ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించిన వారికి నేరుగా.. తుది రాతపరీక్షలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. మిగతా అభ్యర్థులంతా ప్రాథమిక, దేహదారుఢ్య పరీక్షల్లో అర్హత సాధిస్తేనే తుది రాత పరీక్షలో అవకాశం కల్పించారు.