CHALLANS: ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా.. పోలీసు శాఖ జరిమానాలతో ట్రాఫిక్ నిబంధనల అమలుకు కృషి చేస్తోంది. అయితే కొందరు చలాన్లను భారంగా భావించి.. వాటిని చెల్లించకుండానే పోలీసులను తప్పించుకు తిరుగుతుంటారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆ విధంగా 8 ఏళ్లలో రూ.600 కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు పోగయ్యాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు ఆ అంశంపై సమీక్షించారు. రాయితీ ఇస్తే.. పెండింగ్ చలాన్లు వసూలయ్యే అవకాశముందని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. ఏ మేరకు రాయితీలు ఇవ్వాలన్న అంశంపై చర్చించి త్వరలోనే ప్రకటిస్తామని ఉన్నతాధికారులు చెబుతున్నారు.
ఇకపై రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 4 వరకు నిఘా..
తప్పని తెలిసినా అనేక మంది ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతూ.. ప్రమాదాలకు కారణం అవుతున్నారని పోలీసులు విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో నాలుగైదేళ్లుగా నమోదైన ప్రమాదాలను అధ్యయనం చేయగా.. రాత్రి వేళల్లోనే ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించారు. ఇందులో మద్యం మత్తు, అతివేగమే కారణంగా ఉంటోందని తేల్చారు. అందుకోసం రాత్రివేళల్లోనూ పని చేసే అత్యాధునికమైన స్పీడ్ లేజర్ గన్లను త్వరలో తెప్పిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇకపై రాత్రి 11 నుంచి తెల్లవారుజాము 4 వరకు ట్రాఫిక్ పోలీసులు షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తారని చెప్పారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ట్యాంక్‌బండ్, మలక్‌పేట, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో వీరిని నియమించనున్నట్లు వెల్లడించారు.