Gang making fake certificates arrested in HYD: నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠాను చాదర్‌ఘాట్ పోలీసులు, హైదరాబాద్ దక్షిణ మండలం టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి వివిధ రకాల విశ్వవిద్యాలయాలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొహమ్మద్ హాబీబ్, అబ్దుల్ రౌఫ్, మొహమ్మద్ ఇర్ఫాన్, షానవాజ్ ఖాన్, జూబైర్, సల్మాన్ ఖాన్, అబ్దుల్ సత్తార్, సునీల్ కపూర్ 8 మంది ముఠాగా ఏర్పడి ఫేక్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారు.
ఉన్నత విద్య కొరకు విదేశాలకు వెళ్లే వారి వద్ద నుంచి భారీగా డబ్బులు తీసుకొని నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చేవారు. ముహమ్మద్ హాబీబ్ దిల్లీకు చెందిన సునీల్ కపూర్‌తో కలిసి ఈ సర్టిఫికెట్లు తయారు చేయిస్తున్నాడు. విదేశాలకు పంపే కన్సల్టెన్సీ యజమాని, వర్కర్లను మధ్యవర్తిగా పెట్టి తన దందా కొనసాగిస్తున్నాడు.
వీరిని హైదరాబాద్‌లో చాదర్‌ఘాట్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు కలసి పట్టుకున్నారు. వారు తయారు చేసిన నకిలీ సర్టిఫికెట్లలో తెలంగాణ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ, రాజస్థాన్ నర్సింగ్ కౌన్సిల్, బెంగళూర్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ తమిళనాడు, రాజస్థాన్ యూనివర్సిటీ ఫర్ హెల్త్ సైన్స్, తదితర యూనివర్సిటీ, కాలేజ్‌ల పేరుతో తయారు చేసిన నకిలీ సర్టిఫికెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.