దేశవ్యాప్తంగా డిస్కంలు చెల్లించాల్సిన బకాయిలు రూ.లక్ష కోట్లను దాటిపోయినట్లు కేంద్ర విద్యుత్‌శాఖ తాజా నివేదికలో స్పష్టం చేసింది (Pending amount to be paid to power generation companies). తెలంగాణ డిస్కంల బకాయిల సొమ్ము రూ. 6,823 కోట్లకు, ఏపీ డిస్కంల బకాయిలు రూ.7,623 కోట్లకు చేరినట్లు తెలిపింది. కరెంటును కొన్న తరవాత 60 రోజుల్లోగా విద్యుత్కేంద్రాలకు డిస్కంలు సొమ్ము చెల్లించాలి. ఈ బకాయిలన్నీ ఈ 60 రోజుల గడువుదాటినవేని కేంద్రం స్పష్టం చేసింది. సాధారణంగా బయటి విద్యుత్కేంద్రాలకు సుదీర్ఘకాలం బకాయి పెడితే కేంద్రంతో పాటు సదరు ఆ కేంద్రాల యాజమాన్యాలు డిస్కంలపై ఒత్తిడి తెస్తాయి. దీంతో కొంతమేర సొమ్మును చెల్లిస్తుంటాయి. కానీ దేశంలోని పలు రాష్ట్రాల డిస్కంలు ఎంత ఒత్తిడి తెచ్చినా ఆర్థిక కష్టాల కారణంగా బకాయిలు చెల్లించడం లేదు.
సొంత సంస్థలకు హుళక్కి..
తెలంగాణ డిస్కంలు, రాష్ట్ర జెన్‌కో రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యం కిందనే ఉన్నాయి. బయటి సంస్థలకే కాకుండా జెన్‌కోకు కూడా తెలంగాణ డిస్కంలు పెద్దయెత్తున బాకీ పడ్డాయి (Telangana Power Distribution Companies due). జెన్‌కోకు రాష్ట్రంలో పాల్వంచ, మణుగూరు, భూపాల్‌పల్లి, రామగుండంలో విద్యుదుత్పత్తి కేంద్రాలున్నాయి. వీటి నుంచి డిస్కంలకు విద్యుత్ సరఫరా చేస్తోంది. దానిని ప్రజలకు అమ్మి బిల్లులు వసూలు చేస్తున్న డిస్కంలు ఎప్పటికప్పుడు జెన్‌కోకు బిల్లులు చెల్లించకపోవడంతో బకాయిలు దాదాపు రూ. 7,000 కోట్లకు చేరాయి. జెన్‌కో విద్యుత్కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తి చేయాలంటే సింగరేణి గనుల నుంచి నిత్యం 34 వేల టన్నుల బొగ్గు కొనాలి. దానికి ఎప్పటికప్పుడు సొమ్ము చెల్లించాలి. కానీ డిస్కంల నుంచి సొమ్ము రాక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జెన్‌కో సింగరేణికి రూ.2,500 కోట్ల బకాయిపడింది. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక జెన్‌కోలు సైతం బొగ్గు తీసుకుని సొమ్ము చెల్లించకపోవడంతో సింగరేణి సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఇటీవల కార్మికులకు బోనస్‌లు చెల్లించడానికి నిధులు లేక రూ. 500 కోట్ల అప్పులు తీసుకోవడానికి బ్యాంకులను సంప్రదించింది. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర జెన్‌కోలపై ఒత్తిడి తేవడంతో రూ. 600 కోట్ల దాకా చెల్లించాయి. తెలంగాణ జెన్‌కోను సైతం రూ. 2500 కోట్ల బకాయిలు చెల్లించాలని అడిగింది. కానీ డిస్కంల నుంచి సొమ్ము రానందున ఇప్పటికిప్పుడు చెల్లించే పరిస్థితి లేదని జెన్‌కో సమాధానమిచ్చినట్లు సమాచారం.