ఆరుగురు మృతి చెంది.. 12 మంది తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడే పరిస్థితుల్లోకి వెళ్తేనే కానీ... కాలుష్య నియంత్రణ మండలి నిద్ర మత్తు వీడలేదు. పోరస్ కర్మాగారం సీఎఫ్‌వో (కన్సంట్ ఫర్ ఆపరేషన్) నిబంధనలు అమలు చేయడం లేదని, అక్కడి నుంచి వెలువడుతున్న రసాయన వ్యర్థాలతో తమ ప్రాణాలు పోతున్నాయని గ్రామస్థులు పలుమార్లు ఫిర్యాదులు చేసినా తగిన చర్యలు తీసుకోకుండా మండలి అధికారులు మీనమేషాలు లెక్కించారు. తాజాగా కర్మాగారంలో రియాక్టర్ పేలుడు ఘటన చోటుచేసుకోవడంతో ఆ కర్మాగారాన్ని మూసేస్తూ గురువారం రాత్రి ‘‘క్లోజర్ ఆర్డర్’’ జారీ చేయడం గమనార్హం. బుధవారం రాత్రి (ఈ నెల 13న) ఈ ప్రమాదం జరగ్గా... గురువారం ఉదయం అక్కడ తనిఖీలు జరిపిన బోర్డు అధికారులు.... ఈ కర్మాగారం సీఎఫ్‌వో నిబంధనలు పాటించడం లేదని, పరిసర ప్రాంతాల్లో కాలుష్యానికి కారణమవుతోందని పేర్కొంటూ మూసివేత ఆదేశాలిచ్చారు. తక్షణమే అవి అమల్లోకి వస్తాయన్నారు. విద్యుత్తు సరఫరా కూడా నిలిపివేయించారు. ప్రమాదం వల్ల అక్కడ ఏర్పడిన రసాయన వ్యర్థాలన్నింటినీ శాస్త్రీయ పద్ధతిలో తొలగించాలని పేర్కొంది. ఆదేశాల్ని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఇప్పుడు చేపట్టిన చర్యలేవో గతంలో ఫిర్యాదులొచ్చినప్పుడే తీసుకుని ఉంటే ఈ స్థాయిలో ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదు కదా! అని అక్కిరెడ్డిగూడెం గ్రామస్థులు, పర్యావరణవేత్తలు విమర్శిస్తున్నారు. కర్మాగారానికి సంబంధించి కన్సంట్ ఫర్ ఆపరేషన్ (సీఎఫ్‌వో) నిబంధనలు అన్నీ సక్రమంగా అమలు చేస్తున్నారా? లేదా? తనిఖీలు సందర్భంగా గుర్తించిన లోపాలను ఆ తర్వాత సరిదిద్దారా? లేదా? అనేది కాలుష్య నియంత్రణ మండలి అధికారులు నిర్దేశిత కాలవ్యవధిలో తనిఖీలు చేయాలి. కర్మాగారం యాజమాన్యం నిబంధనలు పాటించట్లేదని, లోపాల్ని సరిదిద్దలేదని గుర్తిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ ల్యాబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కర్మాగారానికి సంబంధించి అధికారులు ఇవేవి పాటించడంలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాటిని వారు పాటించి ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగే ఆస్కారం తక్కువగా ఉండేదని చెబుతున్నారు. పీసీబీ ఉదాసీనంగా వ్యవహరించడమే తాజా ప్రమాదానికి పరోక్షంగా కారణమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తీరా ప్రమాదం జరిగిన తర్వాత.. ఏదో ‘‘తాము స్పందించాం’’ అని చెప్పేందుకు కర్మాగారం మూసివేతకు ఆదేశాలిచ్చారని.. పర్యావరణ నిపుణులు చెబుతున్నారు.