అసెంబ్లీపై బీఆర్ఎస్కు గౌరవం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. శాసనసభ సమావేశాలు తెలంగాణ పద్దుపై జరిగిందా లేక కేంద్ర బడ్జెట్‌పై జరిగిందా అనే అనుమానం కలుగుతోందని నేతలు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకే కేంద్రంపై నెపం వేశారని ఆరోపించారు. ఏడు రోజుల బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలన్నీ చర్చకు రాకపోవడం బాధాకరమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మోదీ వైఫల్యాలను ఎండగట్టే క్రమంలో కాంగ్రెస్ సైతం వైఫల్యం చెందిందని విమర్శించడం బాధాకరమన్నారు.
నన్ను ఇబ్బంది పెట్టేందుకే:ప్రతిపక్షాలను అవమానించేలా బీఆర్ఎస్ వ్యవహరించిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రసంగిస్తూ ఈటల పేరును పలుమార్లు ప్రస్తావించడంపై స్పందించారు. అసెంబ్లీ వేదికగా తనను ఇబ్బంది పెట్టేందుకే ఇలా చేసి ఉంటారని అన్నారు. తన సూచనలకు స్పందించినంత మాత్రాన ఈటల పార్టీ మారడని స్పష్టం చేశారు.