ఇంటర్ రెండేళ్లకు ఒకే హాల్‌టికెట్ సంఖ్య కేటాయించనున్నట్లు ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ చెప్పారు. ఎంసెట్‌లో వందలాది మంది విద్యార్థులు రెండో ఏడాది సంఖ్య బదులు మొదటి సంఖ్య నమోదు చేసి ఇబ్బందులు పడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఒక్కో ఏడాదికి ఒక సంఖ్య కేటాయించడం వల్ల విద్యార్థులు గందరగోళానికి గురవుతున్న మాట వాస్తవమేనన్నారు.
సిలబస్ తగ్గింపుపై ఓ ఉప సంఘాన్ని నియమించి కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఆమోదం కోసం ఇటీవల ప్రభుత్వానికి సమర్పించామన్నారు. అంతర్గత మార్కులు 20 శాతం ఉండేలా ప్రతిపాదించామని, ప్రభుత్వం నుంచి దానికి ఇంకా ఆమోదం లభించలేదని తెలిపారు. దానిపై వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించి పంపాలని ప్రభుత్వం సూచించిందని, కరోనా వల్ల ఇంకా ఆ ప్రక్రియ ప్రారంభించలేదన్నారు.