Telangana CMO on Inter results : ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం గణనీయంగా తగ్గడం, విద్యార్థి సంఘాల ఆందోళనలతో సీఎం కార్యాలయం అధికారులు రంగంలోకి దిగారు. తప్పు ఎక్కడుంది? సరిదిద్దే మార్గాలేమిటి? అనే దిశగా అధికారులతో సమాలోచనలు జరుపుతున్నారు.
రంగంలోకి సీఎంవో..
Telangana Inter results 2021 :ఇంటర్ బోర్డు కారణంగా 2019 మార్చి పరీక్షల ఫలితాల్లో పలు తప్పిదాలు చోటుచేసుకున్నాయి. మూల్యాంకనంలో తప్పులు దొర్లడం, మార్కుల కూడికల్లో తేడాలు రావడం, ప్రాక్టికల్ మార్కులను మొత్తం మార్కుల్లో కలపకపోవడం వంటి పొరపాట్లు దొర్లాయి. ఈ క్రమంలో బోర్డుతోపాటు ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా అతి తక్కువ శాతం ఉత్తీర్ణత నమోదవడం, తదనంతరం తలెత్తిన పరిణామాలతో ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. కొద్ది సంవత్సరాలుగా ఇంటర్ తొలి ఏడాదిలో రాష్ట్ర సగటు ఉత్తీర్ణత, ప్రభుత్వ, ప్రైవేటు, గురుకులాల వారీగా ఉత్తీర్ణ శాతాలు తదితర వివరాలను సీఎం కార్యాలయ అధికారులు తెప్పించుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి పరీక్ష విధానాన్ని పాటించారనే సమాచారాన్ని కూడా సేకరించారు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో ‘‘ప్రమోట్ అని అనకుండా ఆల్ పాస్’’ అని ప్రకటించారు. ఇటీవల ఇంప్రూవ్‌మెంట్ నిర్వహించి ఎక్కువ మార్కులొస్తే వాటిని పరిగణనలోకి తీసుకున్నారు. తగ్గితే పాస్ మార్కులను యథాతథంగా ఉంచారు. ఇలా ఏఏ రాష్ట్రాల్లో పరీక్షల్లో ఎలాంటి విధానాన్ని అనుసరించారనే అంశాలను పరిశీలిస్తున్నారు.
ఇప్పుడేం చేద్దాం
TS Inter First Year Results : ఆయా విధానాలపై సీఎం కార్యాలయం అధికారులు ఇంటర్‌బోర్డు, విద్యాశాఖ కార్యదర్శి తదితరులతో మాట్లాడారు. విద్యార్థుల్లో ఆగ్రహం తగ్గించేలా ఏ మార్గాన్ని అవలంబించాలనే అంశంపైనా సమాలోచనలు జరుపుతున్నారు. ఫెయిలయిన సబ్జెక్టుల్లో కనీస మార్కులు ఇచ్చి పాసు చేయడం అందులో ఒక ప్రతిపాదన. త్వరలోనే విద్యార్థులకు ఏదో ఒక ఊరట ఇచ్చే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.
ఆందోళనలు
ABVP Protest about inter first year results : ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని ఏబీవీపీ కార్యకర్తలు శనివారం ముట్టడించారు విద్యా మండలి లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలను నిరసిస్తూ ఏబీవీపీ ఆందోళనకు దిగింది. కరోనా వల్ల పాఠాలు బోధించకుండా.. పరీక్షలు ఎలా నిర్వహిస్తారని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ ప్రశ్నించారు. 52 శాతం మంది విద్యార్థులను ఫెయిల్ చేసి వాళ్లను మానసికంగా కుంగదీశారని అన్నారు. విద్యార్థులందరికీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అధికారులు తగిన న్యాయం చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకొని.. మైదానానికి తరలించారు.
ఇదీ చదవండి:Protest at intermediate board : ఇంటర్‌బోర్డు కార్యాలయం వద్ద ఉద్రిక్తత