లాక్‌డౌన్ అంతకంతకూ పొడిగిస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే వారికి సులభంగా పాసులు జారీచేసేందుకు డీజీపీ కార్యాలయం ఇటీవల ఆన్‌లైన్ వ్యవస్థ ఏర్పాటు చేసింది. సహేతుక కారణం చూపిస్తూ దరఖాస్తు చేసుకుంటే గంటల వ్యవధిలోనే పాసులు పొందే సదుపాయం కల్పించింది. ఈ నెల 4 నుంచి ఇది అందుబాటులోకి రాగా.. ఒకేసారి 23వేల మందికిపైగా దరఖాస్తు చేసుకోవడం వల్ల ఆ రోజు సాయంత్రం 4.20 గంటలకు సర్వర్ స్తంభించింది.
రెండోరోజు సైతం మరో 23వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో సరైన కారణం చూపించిన వారందరికీ పాసులు ఇచ్చారు. ప్రస్తుతం రోజుకు 10-15 వేల వరకూ పాసులను జారీ చేస్తుండటం వల్ల క్రమంగా దరఖాస్తుల సంఖ్య తగ్గింది. ఇప్పుడు 15 వేల దరఖాస్తులు వస్తున్నాయి.