తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా వేళ... గుంపు కనిపిస్తే గుబులే... - dail 100 calls increse in Hyderabad

కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. కొన్ని రోజుల కిందేమో పక్కనున్న వారు తుమ్మినా.. దగ్గినా ఒక్కసారిగా ఉలిక్కిపడేవారు. ఇప్పుడేమో ఇద్దరు, ముగ్గురు గుంపుగా కనిపిస్తే చాలు జంకుతున్నారు. క్షణం ఆలస్యం చేయకుండా డయల్‌ 100కు ఫోన్‌ చేసి పోలీసుల్ని అప్రమత్తం చేస్తున్నారు. 10 వేలకు పైగా ఇలాంటి తరహా ఫిర్యాదులు సైబరాబాద్‌, రాచకొండ పోలీసులకు అందాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

Hyderabad latest news
Hyderabad latest news

By

Published : May 7, 2020, 10:03 AM IST

లాక్‌డౌన్‌ సమయంలో డయల్‌ 100కు కాల్స్‌ వెల్లువెత్తుతున్నాయి. ఏప్రిల్‌ 30 వరకు హైదరాబాద్​ నగరంలోని రెండు కమిషనరేట్లకు 40 వేలకు పైగా ఫిర్యాదులు అందాయి. ప్రతిరోజు సగటున సైబరాబాద్‌ పోలీసులకు 750 నుంచి 800, రాచకొండ పోలీసులకు 500 నుంచి 600 వరకు ఫిర్యాదులు అందుతున్నాయి. రెండింటిలోనూ గుంపులకు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా ఉండటం గమనార్హం.

సమీపంలోని పెట్రోలింగ్‌, బ్లూకోల్ట్స్‌ సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని కౌన్సెలింగ్‌ ఇచ్చి గుంపును చెదరగొడుతున్నారు. అయితే.. 50 నుంచి 60 శాతం ఫిర్యాదుల్లో అక్కడ ఎవరూ కనిపించడం లేదని క్షేత్రస్థాయి సిబ్బంది పేర్కొంటున్నారు. సొంతూరుకెళ్లేందుకు పాసులు కావాలి, ఆహారం దొరకడం లేదు, రేషన్‌ సరకులు కావాలి, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాం.. సాయం చేయండంటూ రెండు కమిషనరేట్లలోనూ 9 వేలకు పైగా కాల్స్‌ వచ్చాయి.

గొడవలు, వాగ్వాదానికి సంబంధించి 2 వేల నుంచి 3 వేల వరకు ఫిర్యాదులు అందాయి. మా ప్రాంతంలో ఫలానా వ్యక్తులకు కొవిడ్‌ లక్షణాలున్నాయంటూ వేయి మందికి పైగా ఫోన్‌ చేసి ఆందోళన వ్యక్తం చేశారు. ‘మేమిద్దరం ఉద్యోగాలు చేస్తాం. ఇన్ని రోజులు ఎప్పుడూ ఇంట్లో ఉండలేదు. తరచూ మా మాధ్య గొడవలు జరుగుతున్నాయి’ అంటూ ప్రతి రోజు పదుల సంఖ్యలో కాల్స్‌ వస్తుండటం గమనార్హం. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు సరకులు విక్రయిస్తున్నారంటూ 600 వరకు కాల్స్‌ వచ్చాయి.

ప్రతి ఫిర్యాదుపై దృష్టి...

లాక్‌డౌన్‌లో డయల్‌ 100కు వివిధ రకాల కాల్స్‌ వస్తున్నాయి. సీపీ సజ్జనార్‌ మార్గదర్శనంలో ప్రతి ఫిర్యాదుపై దృష్టి సారిస్తున్నాం. ఈ విభాగంలో 24 గంటలు సిబ్బంది విధుల్లో ఉండేలా చర్యలు తీసుకున్నాం. క్షేత్రస్థాయిలో 63 పెట్రోలింగ్‌, 107 బ్లూకోల్ట్స్‌ వాహనాలను అందుబాటులో ఉంచాం.

- రవీంద్ర ప్రసాద్‌, ఐటీ సెల్‌ ఇన్‌స్పెక్టర్‌, సైబరాబాద్‌

సాయం చేయాలంటూ...

మా కమిషనరేట్‌ పరిధిలో 80 పెట్రోలింగ్‌, 87 బ్లూకోల్ట్స్‌ వాహనాలను అందుబాటులో ఉంచాం. రోడ్డు ప్రమాదాలు, న్యూసెన్స్‌, హత్యలు, దొంగతనాల ఫిర్యాదులు తగ్గాయి. ఆపత్కాలంలో సాయం చేయాలంటూ ఎక్కువ కాల్స్‌ వస్తున్నాయి. సీపీ మహేష్‌ భగవత్‌ మార్గదర్శనంలో ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తున్నాం.

-రవికుమార్‌, డయల్‌ 100 ఇన్‌ఛార్జి, రాచకొండ

ABOUT THE AUTHOR

...view details