Challenges for Telangana Govt in 2023-24 : ఇవాళ కొత్త ఆర్థిక సంవత్సరం 2023-24 ప్రారంభమైంది. సాధారణంగా జరిగే ప్రక్రియ అయినప్పటికీ.. కేసీఆర్ ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరం అత్యంత కీలకం కానుంది. ఈ ఏడాది రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో సర్కార్ మరోమారు భారీ బడ్జెట్‌ను తీసుకొచ్చింది. రూ.2 లక్షల 90 వేల 396 కోట్ల అంచనాతో పద్దును ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరం లాగానే ఈ ఆర్థిక సంవత్సరంలోనూ సొంత పన్ను ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. తాజాగా గడిచిన ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం రూ.లక్షా 30 వేల కోట్లు దాటుతుందని భావిస్తున్నారు.
2023-24లో పన్ను ఆదాయాన్ని రూ.లక్షా 52 వేల కోట్లకు పైగా అంచనా వేశారు. పన్ను ఆదాయంపై సర్కార్ పూర్తి ఆశావహ ధృక్పథంతో కనిపిస్తోంది. అప్పులపై కేంద్రం ఆంక్షలే ఆందోళన కలిగిస్తున్నాయి. 2022-23 కంటే తక్కువ మొత్తాన్ని ఎఫ్‌ఆర్‌బీఎం రుణంగా ప్రతిపాదించారు. కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఆశించిన గ్రాంట్లు రానప్పటికీ.. మరోమారు రూ.41 వేల కోట్లను బడ్జెట్‌లో పేర్కొన్నారు.
సవాల్‌తో కూడుకున్న పనే..: ఎన్నికల ఏడాదిలో నిధులు సమకూర్చుకుని.. ఖర్చు చేయడం సర్కార్‌కు సవాల్‌తో కూడుకున్న పనే. రైతు బంధు, దళితబంధు సహా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం నిధులు తగు రీతిన సమకూర్చుకోవాల్సి ఉంది. నీటి పారుదల ప్రాజెక్టులకు భారీగానే నిధులు కేటాయించారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ, సమ్మక్క సాగర్‌కు నిధులిచ్చి పనుల్లో వేగం పెంచాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ రుణమాఫీకి బడ్జెట్‌లో రూ.6,385 కోట్లు కేటాయించారు. రూ.90 వేల వరకు ఉన్న రుణాలు అన్నీ మాఫీ అవుతాయని.. మిగిలిన వారు కొద్ది మందే ఉంటారన్నది సర్కార్ ఆలోచన.
సొంత స్థలం ఉన్న వారికి గృహ లక్ష్మి పథకం కింద నియోజకవర్గానికి 2,000 చొప్పున ఇళ్ల నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని పట్టాలెక్కించాల్సి ఉంది. 118 నియోజకవర్గాల్లో 1100 మందికి చొప్పున దళితబంధుకు భారీగా నిధులు కేటాయించారు. ముఖ్యమంత్రి వద్ద అందుబాటులో ఉండే ప్రత్యేక అభివృద్ధి నిధిని భారీగా పెంచారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.2000 కోట్లు ఉన్న ఎస్డీఎఫ్‌ను ఏకంగా రూ.10,348 కోట్లకు పెంచారు. ఎన్నికల ఏడాదిలో ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు, ఇతర సమయాల్లో వచ్చే విజ్ఞప్తుల్ని దృష్టిలో ఉంచుకొని ఈ మొత్తాన్ని భారీగా పెంచారు.