తెలంగాణ

telangana

ETV Bharat / state

పీజీ నీట్‌ లేనట్టే..! ఎగ్జిట్‌ పరీక్ష మార్కులే ప్రామాణికం

పీజీ వైద్యవిద్యలో ప్రవేశాలకు ప్రస్తుతం నిర్వహిస్తున్న నీట్‌కు స్వస్తి చెప్పాలని ఎన్‌ఎంసీ నిర్ణయించింది. ఎంబీబీఎస్‌ తుది సంవత్సరం అనంతరం ప్రత్యేకంగా నిర్వహించే ‘నేషనల్‌ ఎగ్జిట్‌’ పరీక్షలో సాధించిన మార్కుల ప్రాతిపదికనే నీట్‌ పీజీలోనూ ప్రవేశాలను నిర్వహించనుంది.

pg neet
pg neet

By

Published : Aug 14, 2021, 5:50 AM IST

పీజీ వైద్యవిద్యలో ప్రవేశాలకు ప్రస్తుతం నిర్వహిస్తున్న నీట్‌కు స్వస్తి చెప్పాలని జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) నిర్ణయించింది. ఎంబీబీఎస్‌ తుది సంవత్సరం అనంతరం ప్రత్యేకంగా నిర్వహించే ‘నేషనల్‌ ఎగ్జిట్‌’ పరీక్షలో సాధించిన మార్కుల ప్రాతిపదికనే నీట్‌ పీజీలోనూ ప్రవేశాలను నిర్వహించనుంది. ఎగ్జిట్‌ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు పీజీ సీటు కోసం ప్రయత్నించవచ్చు లేదా వైద్యవృత్తిని కూడా ప్రాక్టీస్‌ చేయవచ్చు. ఎగ్జిట్‌లో ఉత్తీర్ణులైతేనే రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తారు. వచ్చేఏడాది నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాశాలను ఎన్‌ఎంసీ పరిశీలిస్తోంది. ఎగ్జిట్‌ పరీక్షలో వచ్చే మార్కులకు మూడేళ్ల వరకూ పరిమితి ఉంటుంది.

పీజీ మెడికల్‌ సీట్ల నిబంధనల క్రమబద్ధీకరణలో మార్పులు చేస్తూ ఎన్‌ఎంసీ ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఒకవేళ తక్కువ మార్కులు వచ్చినవారు.. మరుసటి ఏడాదికి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనుకుంటే మళ్లీ అవకాశమిస్తారా? లేదా? అనే స్పష్టతను ముసాయిదాలో పొందుపరచలేదు. దీనిపై తమ అభిప్రాయాలను, సూచనలు, సలహాలనుpresident.pgmeb@nmc.org.inకు ఈనెల 30వ తేదీలోగా పంపించాలని ఎన్‌ఎంసీ కోరింది.

మరికొన్ని కీలక నిర్ణయాలు

* ఇకనుంచి పీజీ వైద్యవిద్యార్థులను జిల్లా ఆసుపత్రికి కూడా మూణ్నెల్ల పాటు పంపాలని నిర్ణయించారు. వీరికి అక్కడ కూడా ఉపకార వేతనాలు లభిస్తాయి.

* పీజీ సూపర్‌ స్పెషాలిటీలో ఇప్పటి వరకూ వేర్వేరుగా ఉన్న రుమటాలజీ, క్లినికల్‌ ఇమ్యునాలజీలను ఒకటిగా కలిపేశారు. కొత్తగా ఇంటర్‌వెన్షనల్‌ రేడియాలజీ, పీడియాట్రిక్‌ ఆర్థోపెడిక్స్‌, హెడ్‌ అండ్‌ నెక్‌ సర్జరీ, రిప్రొడక్టివ్‌ మెడిసిన్‌ అండ్‌ సర్జరీ కోర్సులను కొత్తగా అందుబాటులోకి తేనున్నారు. పీజీలో బయో ఫిజిక్స్‌, మెడికల్‌ జనటిక్స్‌ కోర్సులను తీసేశారు.

* విద్యాబోధన చేసేటప్పుడు ఉండే పీజీ గైడ్‌ అర్హత కాలాన్ని ఎనిమిది నుంచి అయిదేళ్లకు కుదించారు. ప్రస్తుతం ఒక యూనిట్‌లో ఒక ప్రొఫెసర్‌కు తన అనుభవంతో సంబంధం లేకుండా.. 3 పీజీ సీట్లు ఇస్తున్నారు. ఈ విధానంలో స్వల్పమార్పులు చేస్తూస్పష్టత ఇచ్చారు.

* ఉదాహరణకు ఒక వైద్య కళాశాలలో ఆచార్యుడికి పీజీ బోధనలో ఏడాది అనుభవమే ఉంటే.. ఆ యూనిట్‌కు ఒక్క పీజీ సీటిస్తారు. రెండేళ్ల అనుభవం ఉండి.. ఏడాదిలో ఇద్దరు పీజీ విద్యార్థులకు బోధన అందిస్తే ఆ యూనిట్‌కు 2 పీజీ సీట్లు.. ఆచార్యుడికి అయిదేళ్ల అనుభవం ఉండి, ఏడాదికి కనీసం ఇద్దరు పీజీ విద్యార్థులకు బోధన చేస్తుంటే.. 3 సీట్లు అనుమతిస్తారు. ఆ వైద్యసంస్థలో పదేళ్లుగా పీజీ సీట్లను నిర్వహిస్తూ ఉంటేనే 3 పీజీ సీట్లకు అర్హత లభిస్తుంది. ఇకపై ఆచార్యుడు కూడా మూడేళ్లలో కనీసం 3 పరిశోధన పత్రాలు సమర్పించాలి.

వైద్యసేవల్లో మెరుగైన నాణ్యత ప్రమాణాలు

జిల్లాలకు పీజీ వైద్య విద్యార్థులను పంపించడం వల్ల గ్రామీణ వైద్యం బలోపేతమవుతుంది. వైద్యవిద్యార్థులకు కూడా గ్రామాల్లో జబ్బుల పరిస్థితి గురించి తెలుస్తుంది. ఎగ్జిట్‌ పరీక్ష విధానంలో అనుకోని కారణాల వల్ల తక్కువ మార్కులు వచ్చినవారికి మళ్లీ రాసే అవకాశం కల్పించాలి. కొత్త కోర్సుల వల్ల కూడా వైద్యవృత్తి విస్తృతమవుతుంది. -డాక్టర్‌ పుట్టా శ్రీనివాస్‌, సంచాలకులు మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ వైద్యకళాశాల

ఇదీ చూడండి:NEET: నీట్​లో తొలిసారిగా ప్రశ్నలను ఎంచుకునే విధానం

ABOUT THE AUTHOR

...view details