మీరు వినే సంగీతం.. వ్యక్తిత్వం తెలియజేస్తుంది! - iiit scientists
సంగీతానికి రాళ్లను కరిగించే శక్తి ఉందని పెద్దలంటుంటారు. కానీ అదే సంగీతానికి మనిషి వ్యక్తిత్వం తెలియజేసే శక్తి ఉందని చెబుతున్నారు ట్రిపుల్‌ఐటీ పరిశోధకులు. అదేలాగో ఈ కథనం చదివి తెలుసుకోండి.
మీరు వినే సంగీతం.. వ్యక్తిత్వం తెలియజేస్తుంది!
By
Published : Jul 18, 2020, 8:30 AM IST
|
Updated : Jul 18, 2020, 8:41 AM IST
సంగీతానికి అనుగుణంగా మనిషి కదలికల రేఖాచిత్రాలు ఇలా..
వినే సంగీతానికి అనుగుణంగా మనిషి కదలికలను బట్టి అతని వ్యక్తిత్వం అంచనా వేయవచ్చని ట్రిపుల్‌ఐటీ పరిశోధకులు గుర్తించారు. ఈ విషయం ట్రిపుల్‌ఐటీలోని కాగ్నిటివ్ సైన్స్ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ వినూ అల్లూరి చేపట్టిన పరిశోధన ద్వారా వెలుగు చూసింది.
ఆమె పరిశోధనకు ఫిన్లాండ్‌లోని జ్వాస్కిలా యూనివర్సిటీ ప్రొఫెసర్ పెత్రీ తోయోవినెన్, ట్రిపుల్‌ఐటీ విద్యార్థి యుధిక్ అగర్వాల్ సహకారం అందించారు. పరిశోధనకు అవసరమైన డేటాను ఫిన్లాండ్ యూనివర్సిటీ అందించింది. సాధారణంగా మనం ఏదైనా ఒక తరహా పాట వింటున్న సందర్భంలో దానికి అనుగుణంగా ఉన్న ఇతరత్రా సంగీత ఆల్బమ్స్ మన ప్లేలిస్టులో తర్వాత దర్శనమిస్తాయి. మన అభిరుచిని గుర్తించి మనం సంగీతం వినే యాప్‌లో సహజంగానే అవి ప్రత్యక్షమతాయి.
ఇదే తరహాలో సంగీతానికి అనుగుణంగా మనం స్పందించే తీరు ఆధారంగా మన విలక్షతను తెలుసుకునే వీలుంటుందని ట్రిపుల్‌ఐటీ పరిశోధకలు గుర్తించారు. దాదాపు 73 మందిపై ప్రయోగశాలలో వారు వినే సంగీతానికి అనుగుణంగా స్పందించే కదలికలపై పరిశోధన చేశారు. వీరిని ప్రయోగశాలలో సంగీతం వింటున్న సందర్భంలో శరీరంలోని జాయింట్స్ (కీళ్ల)వద్ద రిఫ్లెక్టివ్ మార్కర్స్ ఏర్పాటు చేశారు. వాటి నుంచి ఇచ్చే సంకేతాలను ఒడిసి పట్టుకునేందుకు వీలుగా కెమెరాలు అమర్చారు. అనంతరం సంగీతం వినిపిస్తూ దాని ఆధారంగా తమకు నచ్చిన రీతిలో కదలమని సూచించారు. కెమెరాల ద్వారా వచ్చిన సంకేతాన్ని మెషిన్ లెర్నింగ్ ద్వారా విశ్లేషించి సదరు మనుషుల వ్యక్తిత్వాన్ని అంచనా వేశారు. సంగీతానికి అనుగుణంగా కదిలినప్పుడు సదరు వ్యక్తుల వ్యక్తిత్వం దాదాపుగా నిర్ధరణ అయ్యింది. అలాగే వినే సంగీతం ద్వారా మనిషి ఎలా ఆలోచిస్తాడో.. మెదడు ఎలా స్పందిస్తుందనేది చెప్పవచ్చని ప్రొ.వినూ అల్లూరి వివరించారు. భవిష్యత్తులో బుద్ధిమాంద్యులపై పరిశోధన చేయడం ద్వారా కీలక అంశాలు రాబట్టవచ్చని, వారిలోని నిబిడీకృతమైన ఎన్నో అంశాలు గుర్తించేందుకు వీలుంటుందని చెబుతున్నారు.