Ellampalli Sripadasagar project: ఎల్లంపల్లి శ్రీ పాదసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తి పరిహారం లభించని వైనంపై వారం, పది రోజుల్లో విచారణ జరిపి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం చెగ్యాం గ్రామానికి చెందిన నిర్వాసితులు సోమవారం సచివాలయంలో ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్‌తో చర్చించి వారి విషయంపై పూర్తి వివరాలను మంత్రి తెలుసుకున్నారు.
ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా ఫలితం లేదు:భూ సేకరణ చట్టం ప్రకారం భూమి హక్కు పట్టాలు ఇచ్చినప్పటికీ.. ఇళ్ల నిర్మాణానికి నిధులు రాలేదని నిర్వాసితులు తెలిపారు. సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప.. తమకు న్యాయం జరగలేదని వాపోయారు. పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 135 ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు పరిహారం ఇస్తున్నట్లు 2009లోనే ప్రకటించినా చెల్లింపులు జరగలేదని వివరించారు.