Lok Sabha Secretariat removed TRS from BAC బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ను లోక్‌సభ సచివాలయం తొలగించింది. టీఆర్ఎస్ తరపున ఇప్పటివరకు బీఏసీ సభ్యుడిగా ఎంపీ నామ నాగేశ్వరరావు ఉన్న విషయం తెలిసిందే. ఇవాళ్టి బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) భేటీకి ఆహ్వానితుడిగానే నామ నాగేశ్వరరావుకు ఆహ్వానం అందింది. ఆరుగురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీకి బీఏసీ సభ్యత్వం ఇస్తారు. టీఆర్‌ఎస్‌కు లోక్ సభలో 9 మంది సభ్యులు ఉన్నప్పటికీ బీఏసీ నుంచి లోక్‌సభ సచివాలయం తొలగించింది. లోక్ సభ బీఏసీలో ఇకపై ఆహ్వానిత పార్టీగానే టీఆర్‌ఎస్ కొనసాగనుంది. లోక్ సభ బీఏసీ ఇకపై ఆహ్వానం పంపితేనే టీఆర్ఎస్ బీఏసీ భేటీకి హాజరుకావాల్సి ఉంటుంది. టీఆర్‌ఎస్‌ను ఇంకా బీఆర్ఎస్‌గా లోక్‌సభ సచివాలయం గుర్తించలేదు.
ఇక టీఆర్ఎస్ పార్టీ... గత ఏడాది బీఆర్ఎస్‌గా మారిన విషయం తెలిసిందే. దీనికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపింది. దీంతో ఇక టీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ముగిసి... బీఆర్ఎస్ ప్రస్థానం మెుదలైంది. అక్టోబర్ 5 వ తేదీన దసరా రోజున టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మారుస్తున్నట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అనౌన్స్ చేశారు. దేశ రాజకీయాల్లోకి వెళ్తున్నట్టుగా ప్రకటించారు.