ఆసియా చిరుతపులులు ప్రత్యేక జన్యు నిర్మాణాన్ని కలిగి ఉన్నాయని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) తాజా పరిశోధన ధ్రువీకరించింది. ఆసియా, ఆఫ్రికా చిరుతలు దాదాపు 50 నుంచి లక్ష సంవత్సరాల మధ్య వేరుపడ్డాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఆసియా, ఆఫ్రికా చిరుతల జన్యు నిర్మాణం చాలా భిన్నంగా ఉందని పరిశోధన ఫలితాలు ధ్రువీకరిస్తుండటం వల్ల చిరుతలు దేశంలో అంతరించిపోకుండా ప్రయత్నాలు కొనసాగించాలని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా అన్నారు.
దేశంలో చిరుతలకు ముప్పు పొంచి ఉండటం వల్ల ఆఫ్రికాలో అత్యధిక సంఖ్యలో ఉన్న చిరుతలను మన అడవుల్లో ప్రవేశపెట్టేందుకు సుప్రీంకోర్టు కేంద్రానికి గతంలో అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసియా, ఆఫ్రికా చిరుతలలో ఉండే భేదాలను గుర్తించేందుకు సీసీఎంబీ, లక్నోలో బీర్బల్ సహాని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పాలియో సైన్సెస్, కోల్‌కతాలోని జంతు సర్వే సంస్థ, యూకేకు చెందిన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం, దక్షిణాఫ్రికాలోని జోహాన్స్‌బర్గ్ విశ్వవిద్యాలయం సంయుక్త పరిశోధనలు నిర్వహించాయి.