మాదకద్రవ్యాల కట్టడికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR Review on drug control news) తీసుకున్న నిర్ణయం ఎక్సైజ్ శాఖలో చర్చకు దారితీస్తోంది. ఈ నిర్ణయం స్వాగతించదగినదే అయినా క్షేత్రస్థాయిలో కార్యాచరణపై సందేహాలు నెలకొన్నాయి. గ్రూపు-2 ద్వారా నేరుగా ఎంపికైన 280 మంది ఎక్సైజ్(Excise Department Telangana) ఎస్సైలకు ఏడాదిన్నర దాటినా రెగ్యులర్ పోస్టింగులు లేకపోవడం ఇందుకు ప్రతిబంధకంగా మారిందనే చర్చ నడుస్తోంది. వీరిలో ఎక్సైజ్ అకాడమీకి అటాచ్‌మెంట్‌లో ఉన్న 87 మందికైతే పది నెలలుగా జీతాలే లేవు. మిగిలిన వారిని ఆయా ఎక్సైజ్(Excise Department Telangana) స్టేషన్లలో తాత్కాలికంగా నియమించినా వారికి ఎలాంటి దర్యాప్తు అధికారాలు ఉండవు. గంజాయి, గుడుంబా.. లాంటి నిషేధిత సరకును పట్టుకున్నా కేసు పెట్టే అధికారం వారికి లేకుండాపోయింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దాదాపు 400 మంది వరకు ఎక్సైజ్ ఎస్సైలున్నా.. మూడొంతుల మందికి ఇలా దర్యాప్తు అధికారం లేకపోవడంతో క్షేత్రస్థాయిలో మాదకద్రవ్యాల కట్టడిపై సందేహాలు నెలకొంటున్నాయి.
ఆ బాధలు వర్ణనాతీతం
మరోవైపు ప్రస్తుతమున్న పూర్తిస్థాయి ఎక్సైజ్(Excise Department Telangana) ఎస్సైలంతా అడ్‌హాక్ పదోన్నతులపై చేరినవారే కావడం గమనార్హం. ఈ అడ్‌హాక్ పదోన్నతుల కారణంగానే ఎస్సైల స్థానాల్లో ఖాళీల్లేక 87 మంది అకాడమీకి పరిమితమై వేతనాలకు నోచుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వీరిలో అత్యధికులు మహిళా ఎస్సైలు కావడంతో ఆయా కుటుంబాల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. తమకు రెగ్యులర్ పోస్టింగ్‌లతోపాటు బకాయి వేతనాల్ని ఇవ్వాలని 280 మంది ఎక్సైజ్ ఎస్సైలు ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా పరిష్కారం లభించడం లేదు. తాజాగా మంగళవారం వీరంతా ఎమ్మెల్సీ కవితను కలిసి వినతిపత్రం సమర్పించారు. సరైన విధుల్లేకుండా వారు ఠాణాలకు పరిమితం కావడం విస్తుగొలిపే అంశంగా మారింది.