తెలంగాణ

telangana

ETV Bharat / state

సమన్వయ లోపమే కారణం - CM KCR Officers Reviews

కరోనా ప్రభావం, లాక్​డౌన్​ అమలుపై సీఎం కేసీఆర్​ సమీక్షించారు. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్​, సీఎస్​ సోమేశ్​కుమార్​, డీజీపీ మహేందర్​రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేసీఆర్​ ఆదేశాలతో సూర్యాపేట, జోగులాంబ గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో పర్యటించిన రాష్ట్ర ఉన్నతస్థాయి బృందం క్షేత్రస్థాయి పరిస్థితిని కేసీఆర్​కు తెలియజేసింది.

సీఎం కేసీఆర్​ సమీక్ష
సీఎం కేసీఆర్​ సమీక్ష

By

Published : Apr 23, 2020, 5:43 AM IST

సూర్యాపేట, గద్వాల, వికారాబాద్‌ జిల్లాలలో శాఖల మధ్య సమన్వయ లోపం వల్లనే కరోనా వైరస్‌ విస్తరిస్తోందని ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్‌కు నివేదించినట్లు తెలిసింది. అధికార యంత్రాంగంపై సరైన పర్యవేక్షణ లేదని, సరిహద్దుల్లో ఉండడం వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వారు వివరించినట్లు సమాచారం. అంతేకాదు.. రోజురోజుకూ వైరస్‌ విజృంభిస్తున్న ఈ మూడు జిల్లాల్లోనూ క్వారంటైన్‌, కంటెయిన్‌మెంట్‌ జోన్ల నిర్వహణ అధ్వానంగా ఉందని పేర్కొన్నట్లు తెలిసింది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందిస్తూ.. ఈ అంశాలన్నింటిపైనా సమీక్ష జరపాలని, వ్యాధి ఉద్ధృతికి వెంటనే నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. రాష్ట్రంలో కరోనా గ్రేటర్‌ హైదరాబాద్‌ తర్వాత సూర్యాపేట, గద్వాల, వికారాబాద్‌ల్లో కరోనా తీవ్రత అధికంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, వైద్యఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారిలను ఆ జిల్లాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ఈ మూడు జిల్లాల్లో పర్యటించిన ఉన్నతాధికారులు బుధవారం రాత్రి హైదరాబాద్‌ చేరుకుని ప్రగతిభవన్‌లో సీఎంను కలిశారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సైతం పాల్గొన్నారు. ఈ జిల్లాల పరిస్థితులను ముఖ్యమంత్రికి నివేదించారు. మూడు జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణను అమలు చేయాలని సీఎం తెలిపారు. లోటుపాట్లను వెంటనే అధిగమించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అన్ని జిల్లాల్లోనూ తనిఖీలు నిర్వహించాలని సూచించారు. వ్యాధికి సంబంధించి అనుమానితులపై నిఘా ఉంచాలని, వారు ఎవరెవరిని కలిశారనేది ముఖ్యమని, అందరికీ సంబంధించిన సమాచారం తీసుకోవాలన్నారు. అనుమానితుల్లో ఏ ఒక్కరూ తప్పించుకొని తిరగడానికి వీల్లేదన్నారు.

కంటెయిన్‌మెంట్‌ జోన్లపై దృష్టి సారించడం ద్వారా మిగిలిన ప్రాంతాలను విస్మరించొద్దని, జోన్లతో పాటు వాటిని ఆనుకొని ఉన్న ప్రాంతాల్లోనూ పర్యవేక్షణ సాగాలన్నారు. పలుచోట్ల లాక్‌డౌన్‌ నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయని, పూర్తిగా నివారించాలన్నారు. జన సంచారాన్ని పూర్తిగా నిరోధించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించారు.

లాక్‌డౌన్‌ పాటిస్తే కచ్చితంగా ఫలితం

కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ వల్ల, కరోనా వైరస్‌ సోకిన వారిని ఎప్పటికప్పుడు గుర్తించి కట్టడి చేస్తున్న కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం జరిపిన పరీక్షల్లో 15 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు తేలిందని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశాలున్నాయన్నారు. ‘‘రాష్ట్రంలో కరోనా సోకిన వారందరినీ గుర్తించాం. వారి ద్వారా ఎవరెవరికి వైరస్‌ సోకే అవకాశం ఉందో కాంటాక్టు లిస్టు తయారు చేసి పరీక్షలు జరిపాం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఏయే ప్రాంతాల్లో కరోనా సోకిన వారున్నారో ఒక అంచనా దొరికింది.

దీని ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా కంటైన్‌మెంట్లు ఏర్పాటు చేశాం. అక్కడ ప్రజలను బయటకు రానీయకుండా, బయటి వారిని అక్కడికి వెళ్లకుండా కఠినంగా వ్యవహరించాం. బాధితులతో కాంటాక్టు ఉన్న వ్యక్తులందరనీ క్వారంటైన్‌ చేశాం. దీని కారణంగా వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా అరికట్టగలిగాం. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విజయవంతంగా అమలవుతున్నది. ప్రజలు కూడా సహకరిస్తున్నారు. మరికొన్ని రోజులు ప్రజలు ఇదేవిధంగా సహకరించి నిబంధనలు పాటిస్తే కచ్చితంగా ఫలితం ఉంటుంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టిన సూచనలు కనిపిస్తున్నాయని వైద్యాధికారులు చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఫలితాలు ఇస్తున్నాయని ముఖ్యమంత్రి అన్నారు.

ఇవీ చూడండి:24 గంటల్లో 1,383 కొత్త కేసులు- 50మరణాలు

ABOUT THE AUTHOR

...view details