తెలంగాణ

telangana

ETV Bharat / state

పాఠశాల, సాంకేతిక విద్యాశాఖల మధ్య సమన్వయ లోపం .. విద్యార్థులకు శాపం - Polytechnic Latest News

పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కాకముందే.. పాలిటెక్నిక్ ప్రవేశాల ప్రక్రియ పూర్తి కావడంతో వేలమంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పాలిసెట్‌లో అర్హత సాధించినా డిప్లొమా కోర్సుల్లో చేరే అవకాశం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంవత్సరం నష్టపోవద్దన్న అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఉద్దేశ్యం నెరవేరనట్లేదని.. మరో విడత కౌన్సెలింగ్ నిర్వహించాలని వారు కోరుతున్నారు.

పాలిటెక్నిక్
పాలిటెక్నిక్

By

Published : Sep 8, 2022, 3:41 PM IST

పాఠశాల, సాంకేతిక విద్యాశాఖల మధ్య సమన్వయ లోపం .. విద్యార్థులకు శాపం

పాఠశాల, సాంకేతిక విద్యాశాఖల మధ్య సమన్వయ లోపం వేలాది మంది విద్యార్థులకు శాపంగా మారింది. పదోతరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కాకముందే సాంకేతిక విద్యా శాఖ పాలిసెట్ కౌన్సెలింగ్ ముగించింది. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల నిర్వహించిన పాలిసెట్‌లో 79,038 మంది అర్హత సాధించారు. అయితే వారిలో కొంతమంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు.

విద్యాసంవత్సరం నష్టపోవద్దన్న ఉద్దేశంతో పాఠశాల విద్యాశాఖ పదోతరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించింది. ఈనెల 2న ఫలితాలను ప్రకటించింది. సప్లిమెంటరీ ఫలితాల్లో 38447 మంది ఉత్తీర్ణులుగా కాగా.. వారిలో వేల సంఖ్యలో పాలిసెట్‌లో అర్హత సాధించిన వారున్నారు. అయితే పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను అప్పటికే సాంకేతిక విద్యాశాఖ పూర్తిచేసింది. జులై 18నే పాలిటెక్నిక్ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించింది.

రెండు విడతల్లో పూర్తిచేసి గతనెల 17న తరగతులు ప్రారంభించింది. మిగిలిన సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్లను ముగించడంతో పాలిసెట్‌లో అర్హత సాధించి పదోతరగతి సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైనా వారు పాలిటెక్నిక్‌లో చేరే అవకాశం కోల్పోయామని విద్యార్థులు వాపోతున్నారు. విద్యా సంవత్సరం నష్టపోవద్దన్న ఉద్దేశంతో వెంటనే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించినా ప్రయోజనం నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

తమ కోసం మరోవిడత కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు. ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడించగానే.. ఉత్తీర్ణులైన వారి కోసం ఇంజినీరింగ్ మొదటివిడత సర్టిఫికెట్లు, వెబ్‌ఆప్షన్ల గడువు పొడిగించి అవకాశం కల్పించారని అన్నారు. అదే విధంగా తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలను ఆలస్యంగా విడుదల చేయడం వల్లే ఈ గందరగోళం తలెత్తిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాంకేతిక విద్యాశాఖ అధికారులతో చర్చించి విద్యార్థులు నష్టపోకుండా చూస్తామని పాఠశాల విద్య డైరెక్టర్ శ్రీదేవసేన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details