ఆంధ్రప్రదేశ్లో రూ.కోట్ల డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన ది జయలక్ష్మి మ్యూచువల్ ఎయిడెడ్ మల్టీపర్పస్ కో-ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ కేసులో సీఐడీ పురోగతి సాధించింది. ఈ ఆర్ధిక నేరం కేసులో ఏ-1గా ఉన్న సొసైటీ చైర్మన్ రాయవరపు సీతారామాంజనేయులు, ఏ-2గా ఉన్న వైస్ చైర్మన్ రాయవరపు బదరీ విశాలాక్షిలతో పాటు కేసులో ఏ-4 రాయవరపు జయదేవమణిని సీఐడీ బృందం అరెస్టు చేసింది.
జయదేవమణిని శనివారం కాకినాడలోని రెండో అదనపు, జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం జయదేవమణికు రిమాండ్ విధించింది. ఈ కేసులో కీలకమైన సీతారామాంజనేయులు, బదరీ విశాలాక్షిలను సీఐడీ బృందం నేడు జ్యుడిషయల్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు.
కాకినాడలోని సర్పవరం కేంద్రంగా జయలక్ష్మి ఎంఏఎం కో-ఆపరేటివ్ సొసైటీ కాకినాడ, కోనసీమ, తూగో, పగో, విశాఖ, కృష్ణ జిల్లాల్లో 29 బ్రాంచీలు నడుపుతోంది. 59205 మంది ఖాతాదారులు.. 19వేల మంది పొదుపుదారులున్నారు. రూ.582 కోట్ల వరకు డిపాజిట్లు సేకరించిన సొసైటీ యాజమాన్యం రుణాల మంజూరులో నిబంధనలు అతిక్రమించి సొంత అవసరాల కోసం రుణాలు వాడుకున్నారు.