రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షునికి సంబంధించి.. సరికొత్త సంప్రదాయం ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కాకుండా... హైదరాబాద్‌లో పనిచేస్తున్న సీనియర్ అధికారి అధ్యక్షుడుగా వ్యవహరించే సంప్రదాయం గతంలో కొనసాగేది. మొన్నటివరకు బీపీ ఆచార్య.. రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షునిగా కొనసాగారు. ఇటీవలే ఆయన పదవీవిరమణ చేయడంతో గురువారం ఐఏఎస్ అధికారుల సర్వసభ్య సమావేశం జరిగింది.
నియమావళి సవరణ సరికాదు
అధ్యక్షపదవి ఖాళీగా ఉండడం, ఉపాధ్యక్షురాలు శాంతికుమారి హాజరు కాకపోవడం వల్ల నేపథ్యంలో గౌరవకార్యదర్శిగా ఉన్న వికాస్‌రాజ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. అధ్యక్ష పదవికి సంబంధించి నియమావళిని సవరించాలని ప్రతిపాదించిన కొందరు... ఇకనుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షునిగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఆ ప్రతిపాదనను కొందరు సీనియర్ అధికారులు వ్యతిరేకించారు. ప్రస్తుతం రాష్ట్ర ఐఏఎస్ అధికారుల్లో సీనియరైన సురేశ్‌చందా సహా అదర్ సిన్హా అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందస్తు నోటీసు లేకుండా, అజెండాలో పొందుపర్చకుండా నియమావళి సవరణ సరికాదని సూచించారు. మెజార్టీ సభ్యుల ఆమోదంతో నియమావళిని సవరించడంతో.. రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షునిగా... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యవహరించనున్నారు. ఉపాధ్యక్షునిగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శిగా సాధారణ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ వ్యవహరిస్తారు. స్థానిక, ఇతర ప్రాంతాల అధికారులు సహా … అన్ని వర్గాలు వారికి ప్రాతినిధ్యం ఉండేలా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.