తెలంగాణ

telangana

ETV Bharat / state

Irrigation: ప్రాజెక్టుల్లో జలకళ... ఇక సాగుభళా...

తెలంగాణలో ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. ఈ మేరకు పూర్తిస్థాయిలో ఆయకట్టు సాగు కానుంది. లక్ష్యానికి మించి సాగయ్యే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అంచనా వేస్తోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ నిండాయి.

Irrigation
సాగుభళా

By

Published : Aug 1, 2021, 5:04 AM IST

రాష్ట్రంలోని భారీ, మధ్యతరహా ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకోవడంతో పూర్తి స్థాయిలో ఆయకట్టు సాగు కానుంది. జులై ఆఖరుకే ప్రధాన ప్రాజెక్టులన్నీ పొంగిపొర్లడంతో లక్ష్యానికి మించి సాగయ్యే అవకాశం ఉందని నీటిపారుదలశాఖ అంచనా వేస్తోంది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కిందనే 40 లక్షల ఎకరాలకుపైగా సాగుకు 500 టీఎంసీలకు మించి నీటిని వినియోగించుకొనే అవకాశం ఏర్పడింది. ఎగువ రాష్ట్రాల్లోనూ, రాష్ట్రంలోనూ కురిసిన భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ నిండాయి. వీటితో పాటు మధ్యతరహా ప్రాజెక్టులు, చెరువులు కూడా చాలావరకు నీటితో ఆహ్లాదాన్ని నింపుతున్నాయి.

జూన్‌ ఆఖరులో ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు, అన్ని ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజినీర్లతో జరిగిన సమావేశంలో మొత్తం 418.134 టీఎంసీలతో 39.35 లక్షల ఎకరాలకు భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కింద నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి కూడా తెలిపారు. కొన్ని ప్రాజెక్టుల కింద చెరువులు నింపి ఆయకట్టుకు నీరందించాలని కూడా నిర్ణయించారు. అయితే ఇలా నిర్ణయించిన చెరువుల్లోకి కూడా భారీ వర్షాలతో నీరొచ్చింది. కొన్ని ప్రాజెక్టుల కింద లక్ష్యానికి మించి ఆయకట్టు సాగయ్యే పరిస్థితి వచ్చింది. మొత్తమ్మీద భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల ద్వారానే ఈ వానాకాలంలో 500 టీఎంసీలకు పైగా వినియోగంతో 40 లక్షల ఎకరాలకు మించి ఆయకట్టు సాగయ్యే అవకాశం ఉందని తాజాగా నీటిపారుదల శాఖ అంచనా.

కాళేశ్వరం కింద చెరువుల ద్వారానే ఎక్కువ...

ఈ వానాకాలంలో కాళేశ్వరం ఎత్తిపోతల కింద చెరువులు నింపడం ద్వారానే ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశం ఉంది. అనంతగిరి, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మల కింద ప్రధాన కాలువలు పూర్తయినప్పటికి కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటరీలు, మరికొన్ని చోట్ల మైనర్లు, సబ్‌ మైనర్లు పూర్తి కావలసి ఉంది. మల్లన్నసాగర్‌ నిర్మాణం పూర్తి కావడానికి మరో రెండుమూడు నెలలు పట్టే అవకాశం ఉంది. మరికొన్ని రిజర్వాయర్లు, కాలువలు నిర్మాణంలో ఉన్నాయి. ప్రధాన కాలువలు పూర్తయిన రిజర్వాయర్ల కింద ఎక్కువభాగం చెరువుల ద్వారానే నీటిని ఇవ్వనున్నారు. వర్షాలతో నిండిన చెరువుల్లో నీటినిల్వలు తగ్గిన తర్వాత కాళేశ్వరం నీటితో నింపనున్నారు. మొత్తమ్మీద ఈ ప్రాజెక్టు కింద ఎంత ఆయకట్టుకు నీరివ్వగలిగారన్నది మరికొన్ని రోజులు గడిస్తే కానీ చెప్పలేని పరిస్థితి.

ABOUT THE AUTHOR

...view details