ఈ నెల 18వ తేదీన నిర్వహించాల్సిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం జాగ్రఫీతోపాటు మోడర్న్ లాంగ్వేజెస్ సబ్జెక్టుల పరీక్షలు జూన్ 3న నిర్వహిస్తామని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. గతంలోని హాల్‌టికెట్లు, పరీక్షా కేంద్రాలే ఉంటాయని పేర్కొన్నారు. రెండో రోజు ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనానికి మొత్తం 9,202 మంది అధ్యాపకులు హాజరయ్యారని తెలిపారు.
లాక్‌డౌన్ కొనసాగుతున్నా కొన్ని కళాశాలలు ఇంటర్ రెండో ఏడాది విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తూ ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వచ్చే ఏడాదికి ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు ఇవ్వనందున ఆన్‌లైన్ తరగతులు నిర్వహించడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు.
మరో మూడు చోట్ల ఇంటర్ ఒకేషనల్ మూల్యాంకనం
ఇంటర్‌మీడియట్ ఒకేషనల్ కోర్సుల జవాబుపత్రాల మూల్యాంకనాన్ని ప్రస్తుతం ఉన్న హైదరాబాద్‌తోపాటు మరో మూడు చోట్ల నిర్వహించాలని ఇంటర్‌బోర్డు నిర్ణయం తీసుకుంది. కొత్తగా నిజామాబాద్, కరీంనగర్, నల్గొండలో మూల్యాంకన కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈనెల 15వ తేదీ నుంచి ఒకేషనల్ మూల్యాంకనం ప్రారంభం కానుంది.
ఈసారి ‘జోసా’ కౌన్సెలింగ్ 6 విడతలే
ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే 107 జాతీయస్థాయి విద్యా సంస్థల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి ఈసారి ఆరు విడతల కౌన్సెలింగే జరిగే అవకాశం ఉంది. గత విద్యా సంవత్సరం జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ(జోసా) ఆధ్వర్యంలో ఏడు విడతల కౌన్సెలింగ్ నిర్వహించారు. అయినా ఎన్‌ఐటీల్లోని కొన్ని బ్రాంచీల్లో సీట్లు మిగిలిపోవడంతో వాటికి ప్రత్యేకంగా రెండు విడతల కౌన్సెలింగ్ జరిపారు. ఈసారి కరోనా కారణంగా ప్రవేశ పరీక్షల నిర్వహణే మూడు నెలలు ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో తరగతుల ప్రారంభం ఆలస్యమవుతుందని భావించిన ఐఐటీ దిల్లీ కౌన్సెలింగ్‌ను ఆరు విడతలకు కుదించాలని జాయింట్ అడ్మిషన్ బోర్డు(జేఏబీ)కు ప్రతిపాదించింది.
ఇదీ చదవండి:'మిగులు జలాల వినియోగంపై పూర్తి వివరాలు సమర్పించండి'