తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతరను తలపించిన మార్కెట్లు.. పట్టించుకోని అధికారులు - ఆదివారం మార్కెట్లు.

కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే.. వ్యక్తిగత దూరం పాటించాలి. ఇది ప్రధాన సూత్రం. కానీ హైదరాబాద్​ నగర ప్రజలు మాత్రం దానిని పట్టించుకోవడం లేదు. కాలుపెట్టే స్థలం లేని మార్కెట్లలో.. కిక్కిరిసిపోయి.. మాస్కులు జారిపోయినా పట్టించుకోకుండా.. కావాల్సింది కొన్నాం అనేట్టు వ్యవహరిస్తున్నారు. కరోనా అంటే భయం లేదు.. ఆ మహమ్మారిని కట్టడి చేద్దామనే బాధ్యత లేకుండా మార్కెట్లకు పోటెత్తారు. నగర వ్యాప్తంగా ఆదివారం ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపించాయి.

ఆదివారం మార్కెట్లు, హైదరాబాద్​ వార్తలు
sunday market, hyderabad markets

By

Published : May 17, 2021, 9:17 AM IST

ఓ వైపు కొవిడ్​ కట్టడికి ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తుంటే.. మరోవైపు లాక్​డౌన్​ సడలింపు సమయంలో ప్రజలు కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. భౌతిక దూరం, మాస్కులు మరచి.. తమకు కావలసిన వాటిని కొనుగోలు చేయడంపైనే దృష్టి పెడుతున్నారు. ఇంక ఆదివారం సంగతి చెప్పనక్కర్లేదు.

వ్యక్తిగత దూరానికి అవకాశమేలేదు..

హైదరాబాద్​ నగరంలో చేపలు నిత్యం దొరుకుతాయి. ఆదివారమే తినాలనే నిబంధన ఏమీ లేదు. కానీ ఆ రోజే జనం ఎగబడతారు. అసలే ఇరుకు స్థలంలో ఉన్న మార్కెట్లు సాధారణంగానే కిటకిటలాడుతాయి. ఇక ఆదివారం వచ్చిందంటే జాతరే. కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డుకు చేరువలోని హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్‌ దగ్గర మార్కెట్‌ను పరిశీలించినా.. నిజాంపేట చౌరస్తాకు వెళ్లినా.. ప్రగతి చెరువు చెంతకు చేరినా.. రహ్మత్‌నగర్‌, ఎల్‌బీనగర్‌, వనస్థలిపురం, లింగంపల్లి ఇలా నగరంలో ఏ చౌరస్తాను పరిశీలించినా ఆదివారం చేపల మార్కెట్లు కిటకిటలాడాయి.

కిక్కిరిసిన ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌..

సాధారణంగానే ముషీరాబాద్‌ చేపల మార్కెట్‌ కిక్కిరిసిపోతుంది. ఆదివారం వేకువ జామునుంచి అక్కడ జాతరే. కేవలం ఎకరా స్థలంలో ఉన్న ఈ మార్కెట్‌లో కాలు కదపడానికి వీలు లేదు. కరోనా వేళ ఇక్కడి మార్కెట్‌ను దగ్గర్లోని మైదానాలకు పంపించాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేయకపోవడం విడ్డూరంగా ఉంది. ఈ మార్కెట్‌ను కొత్తపేట పండ్ల మార్కెట్‌ చెంతకు తరలించాలనే ప్రతిపాదన అటకెక్కింది. కనీసం కరోనా సమయంలో ఆర్టీసీ బస్సు భవన్‌ పక్కన ఉన్న స్థలాన్ని, లేదంటే సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానాన్ని వినియోగించుకోవచ్చు. అస్సలు అలాంటి ఆలోచనే జీహెచ్‌ఎంసీకి పట్టకపోవడం.. విచారకరం.

మారని జనం.. వీడని కరోనా భయం..!

ప్రస్తుత తరుణంలో ఎవరికి వారు లాక్‌డౌన్‌ విధించుకోవాల్సింది పోయి.. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ను కూడా పట్టించుకోకపోతే ఎలా అనే ఆలోచనే లేకుండా పోతోంది. లాక్‌డౌన్‌ విధిస్తారనే సూచనలు కనిపించేసరికే మద్యం దుకాణాలకు పోటెత్తారు. ఆదివారం వస్తే మార్కెట్లను కుమ్మేస్తున్నారు. సెలవురోజు కావటంతో పోలీసులు కూడా చూసీ చూడనట్టు ఉండడంతో ఆ 4 గంటలు రహదారులు, మార్కెట్లు, దుకాణాలు కిక్కిరిసిపోయాయి. ఆ తర్వాత కూడా వాహనాలు అదే రీతిన తిరిగాయి.

ఇదీ చూడండి:నేడు రాష్ట్రంలో కొవాగ్జిన్‌ టీకా రెండో డోసు నిలిపివేత

ABOUT THE AUTHOR

...view details