తెలంగాణ

telangana

ETV Bharat / state

Ganesh chaturdi: చరిత్ర పుటల్లో వినాయక చతుర్థి.. శివాజి నుంచి తిలక్​ వరకు ప్రస్థానం - వినాయక చవితి చరిత్ర

వినాయక చవితి అంటే బొజ్జగణపయ్యను ఆరాధించే పండుగ మాత్రమే కాదు... దేశ స్వాతంత్య్ర కాంక్షను రగిలించిన వేడుక అంటే నమ్ముతారా...? కానీ ఇది నిజం. ఈ పండుగను పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంగా ఎలా అయితే చెప్పుకుంటారో... స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రజలను ఏకం చేసిన ఏకదంతుడి పండుగ అని కూడా చెప్పుకోవాలి. చరిత్ర పుటల్లో చత్రపతి శివాజి నుంచి బాలగంగాధర తిలక్​ కాలం వరకు గణనాథుడి వేడుకలు ఎలా జరిగేవంటే...

vinayaka chavithi
vinayaka chavithi

By

Published : Sep 10, 2021, 5:53 AM IST

వినాయకుడి పుట్టినరోజును పురస్కరించుకొని ఘనంగా నిర్వహించుకునే వేడుక వినాయక చవితి. ఏటా భాద్రపద మాసంలో వచ్చే ఈ పండుగ అంటే ప్రతి లోగిలి ఎంతో పులకించిపోతుంది. బొజ్జగణపయ్యను ప్రతిష్టించి.. పలు రకాలైన ప్రసాదాలు నివేదించి... మనసున ఉన్న కోరికలు గణనాథుడి చెవిన వేసి.. కన్నుల పండువగా నవరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు.

శాతవాహన, చాళుక్యుల కాలం నుంచి...

ఈ పండుగను అధికారికంగా ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారనడానికి సరైన ఆధారాలు లేనప్పటికీ... శాతవాహన, చాళుక్యుల కాలంలో గణేష్ చతుర్థి వేడుకలు ప్రారంభమైనట్లు కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. క్రీ.పూ. 271 నుంచి వినాయకచవితి వేడుకలు జరిగినట్లు చరిత్ర రికార్డుల్లో ఉంది. అలాగే ఛత్రపతి శివాజీ... ఈ పండుగను తమ ఆరాధ్య దైవం పండుగగా ఘనంగా జరిపించినట్లు చరిత్రకారుల మాట. అప్పటి వరకు కొంత మంది ఇళ్లలోనే జరిగిన వినాయక చతుర్థిని... పుర వీధుల్లో జరిపించారు.

సామాజిక పండువగా.. ప్రజల్లోకి

1983లో లోకమాన్య బాలగంగాధర్ తిలక్... చవితి వేడుకను సామాజిక పండుగగా మార్చారు. బ్రిటిష్ ప్రభుత్వం సామాజిక, రాజకీయ సమావేశాలపై నిషేధం విధించడంతో తిలక్ ఆధ్యాత్మిక బాట ఎంచుకున్నారు. అప్పటి సామాజిక పరిస్థితుల దృష్ట్యా ఆంగ్లేయుల పరిపాలన నుంచి విముక్తి కలిగించడానికి ప్రజల్లో జాతీయ భావం, ఐకమత్యం పెంపొందించడానికి వినాయక చవితి పర్వదినాన్ని జాతీయ సమాఖ్య పండుగగా జరిపారు. పేద‌, ధ‌నిక‌, వ‌ర్ణ భేదాలు లేకుండా అంద‌రూ ఏకతాటి పైకొచ్చి సామూహికంగా వేడుక‌ల‌ను జ‌రుపుకుంటే ప్రజల మధ్య ఎలాంటి తార‌త‌మ్యాలు ఏర్పడవని... వారంద‌రూ ఐక‌మ‌త్యంగా ఉండి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారని తిలక్ నమ్మారు. అందుకే గ‌ణేష్ వేడుక‌ల‌ను తిలక్ బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించడం మొదలుపెట్టారు.

బహిరంగ ప్రదేశాల్లో వేడుకలకు ఇదే మూలం

మండపాల్లో వినాయకుడి విగ్రహాలు, 9 రోజుల పాటు పూజలు ఆ తరువాత నిమజ్జనం చేయడం ఆరంభించారు. అదే ఇప్పటి ఉత్సవాలకు మూలం అని చెప్పొచ్చు. తిల‌క్ చేసిన ఆలోచ‌న వ‌ల్ల నిజంగానే అప్పట్లో ప్రజల్లో మార్పు క‌నిపించింది. ఆ తర్వాత స్వాతంత్య్ర ఉద్యమం మ‌రింత తీవ్రమయ్యేందుకు గణేష్ చ‌తుర్థి వేడుక‌లు కారణమయ్యాయి.

ఐకమత్యానికి తిలోదకాలిచ్చి.. ఆర్బాటాలకు వేదికలై

బాలగంగాధర్ తిలక్ అడుగుజాడల్లో వినాయక చవితిని ఇప్పుడు వాడవాడలా వైభవోపేతంగా జరుపుకుంటున్నాం. కాని దురదృష్టకరమైన విషయం ఏమిటంటే... ప్రస్తుతం ఐకమత్యాన్ని మరిచిపోయి కొన్ని చోట్ల ఒకే వీధిలో నువ్వా నేనా అన్నట్లు విడిపోయి.. వేర్వేరుగా జరుపుకుంటూ హంగులు, ఆర్బాటాలకు చవితి వేడుకలు దారితీశాయి.

ఇదీ చూడండి:khairathabad ganesh: దర్శనానికి సిద్ధమైన ఖైరతాబాద్​ గణపతి

ABOUT THE AUTHOR

...view details