ఉత్పత్తి ఎక్కువ.. ఆదాయం తక్కువ.. వ్యవసాయ పంటలకు కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధరల కన్నా రాష్ట్రంలో సాగు వ్యయం చాలా ఎక్కువగా ఉందని వ్యవసాయ శాఖ అధ్యయనంలో వెల్లడైంది. పంటల ఉత్పత్తి వ్యయానికి మద్దతు ధరలకు ఏ మాత్రం పొంతన లేదని ఈ శాఖ స్వయంగా ప్రకటించింది. క్షేత్రస్థాయిలో వ్యవసాయంలో కీలకమైన విత్తనాలు, డీజిల్, కూలీల ఖర్చులు అధికంగా పెరిగాయి. సాగు వ్యయం ఎక్కువకావడం వల్ల పంటల ఉత్పత్తి వ్యయం ఆకాశాన్నంటుతోంది.
రాష్ట్ర వ్యవసాయ శాఖ సిఫారసు
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పంటల సాగుకు కీలకమైన సమయంలో కూలీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణ మార్పులు, మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గుల కారణంగా వ్యవసాయం అస్థిరంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ప్రకటించే మద్దతు ధరలు రైతులకు చేయూతనిచ్చేలా ఉండాలని తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ సిఫారసు చేసింది.
వచ్చే ఏడాది మద్ధతు ధరలు పెంపు..?
వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రతి పంటకు ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న దృష్ట్యా వచ్చే ఏడాది మద్దతు ధరలు పెంచాలని జాతీయ వ్యవసాయ, వ్యయ ధరల కమిషన్ - సీఏసీపీకి వ్యవసాయ శాఖ సిఫారసులు చేసింది. ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులకు అనుగుణంగా సాగు వ్యయంపై 50 శాతం అదనంగా కలిపి రైతులకు ఇవ్వాలని స్పష్టం చేసింది.
వ్యాపారులు ఇచ్చిందే ధర
2020 - 21 ఖరీఫ్, యాసంగి పంట కాలాల్లో సాగు చేసే పంటలకు ఇవ్వాల్సిన మద్ధతు ధరలపై సీఏసీపీ విజయవాడలో దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ శాఖలు, రైతులు, శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించింది. దక్షిణ భారతంలో అధికంగా సాగవుతున్న పసుపు, మిరప, ఆయిల్‌పాం పంటలకు తప్పనిసరిగా మద్దతు ధర ప్రకటించాలని తెలంగాణ కోరింది. ఈ పంటలకు మద్దతు ధరలు ప్రకటించకపోవడం వల్ల వ్యాపారులు ఇచ్చిందే ధర అన్నట్లుగా మారి రైతులు నష్టాలు చవిచూస్తున్నారని స్పష్టం చేసింది.
నష్టాల ఊబిలో రైతన్న..
- ఈ ఏడాది రానున్న జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఖరీఫ్ సీజన్‌లో 1 క్వింటాల్ పత్తి పంట ఉత్పత్తి వ్యయం రూ.10,043 అవుతుందని అంచనా. ఈ లెక్కన సంవత్సరం మద్దతు ధర రూ. 5,550 ఇస్తున్నప్పటికీ.. క్వింటాకు సగటున రూ. 3,500ల చొప్పున రైతులు నష్టాలు చవిచూస్తున్నారని వ్యవసాయ శాఖ గణాంకాలు వివరిస్తున్నాయి.
- ప్రధాన ఆహార పంట.. వరి తీసుకుంటే ఏ గ్రేడ్ పండించడానికి క్వింటాల్‌కు వచ్చే ఏడాది రూ. 2,529 వ్యయం కానుంది. కానీ, ఇస్తున్న కనీస మద్దతు ధర రూ. 1,835 మాత్రమే. 1 హెక్టారు విస్తీర్ణంలో వరి సాగు చేయాలంటే రూ. 87,059 ఖర్చవుతుంది. ఈ పెట్టుబడిలో కూలీల వ్యయమే ఏకంగా రూ.50,563 వరకు అవుతుందని వ్యవసాయ శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇవీ చూడండి:నేడు సహకార ఎన్నికలు... సాయంత్రం ఫలితాలు