తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎస్ఈసీ సర్క్యులర్‌ అమలును నిలిపివేసిన హైకోర్టు

ఎన్నికల బ్యాలెట్‌ పత్రాల్లో స్వస్తిక్‌ గుర్తు కాకుండా... స్టాంపు వేసినా ఓటేసినట్లే పరిగణించాలంటూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఉత్తర్వులను... హైకోర్టు నిలిపి వేసింది. ప్రత్యేక ఓట్ల కంటే మెజార్టీ తక్కువగా ఉంటే....ఫలితం నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలను ఎస్ఈసీ రిటర్నింగ్ అధికారులకు తెలిపింది.

The High Court stayed the execution of the SEC circular in telangana
ఎస్ఈసీ సర్క్యులర్‌ అమలును నిలిపివేసిన హైకోర్టు

By

Published : Dec 4, 2020, 12:21 PM IST

జీహెచ్​ఎంసీ ఎన్నికల కౌంటింగ్ సరికొత్త మలుపు తిరిగింది. బ్యాలెట్ పత్రాల్లో స్వస్తిక్ గుర్తు లేకున్నా ఓటును పరిగణించాలంటూ.. గురువారం అర్ధరాత్రి ఎస్​ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సర్కులర్ నిలిపివేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. గురువారం ఎన్నికల సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో పలువురు ఉద్యోగులు... ఓటింగ్ సమయంలో ఓటర్లకు స్వస్తిక్ ముద్రకు బదులు.. పొరపాటున పోలింగ్ కేంద్రం సంఖ్య తెలిపే ముద్రల్ని ఇచ్చామని ఎస్​ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ఎస్​ఈసీ ..ఆ ఓట్లనూ లెక్కించాలని ఎన్నికల అధికారులకు సూచించింది. ముద్ర మారినా... ఓటర్ల ఎంపిక మారదంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఉత్తర్వులపై భాజపా, కాంగ్రెస్ అభ్యంతరం...

ఎస్​ఈసీ ఉత్తర్వులపై కాంగ్రెస్‌, భాజపాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అడ్డదారిలో గెలిచేందుకు తెరాస ప్రయత్నిస్తోందని.. అధికార పక్షంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ కుమ్మక్కయ్యారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. సర్క్యులర్‌పై తీవ్రంగా స్పందించారు. హస్యంగా అర్ధరాత్రి సర్క్యులర్‌ జారీచేయడమే అందుకు నిదర్శనమని మండిపడ్డారు. స్వస్తిక్‌ గుర్తుతో ఉన్న ఓట్లను మాత్రమే లెక్కించాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వాటిని రాజకీయపార్టీల దృష్టికి తీసుకెళ్లాలని ఎన్నికల కమిషనర్‌కు కాంగ్రెస్‌ పార్టీ లేఖ రాసింది.

హైకోర్టులో పిటిషన్, స్టే ఇచ్చిన ధర్మాసనం

ఎస్​ఈసీ సర్క్యలర్​ను సవాల్ చేస్తూ ఓ న్యాయవాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్​పై అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న న్యాయవాది విజ్ఞప్తి మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎస్​ఈసీ సర్క్యులర్​ను నిలిపివేస్తూ ఆదేశాలు జారీచేసింది. ఇతర ముద్రలను పరిగణనలోకి తీసుకోవాలన్న ఎస్ఈసీ నిర్ణయాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పు పట్టింది. ఇతర ముద్రలు ఉన్న ఓట్లు గెలుపు ఓటములపై ప్రభావితం చేసినట్లయితే.. అక్కడ ఫలితాన్ని పక్కన పెట్టాలని స్పష్టం చేసింది. అదే విధంగా ఇతర ముద్రలతో ఉన్న ఓట్లు వందకు పైగా ఉంటే ఫలితాన్ని పెండింగ్‌లో పెట్టాలని ఆదేశించింది. ఇతర ముద్రలు ఉన్న బ్యాలెట్ పత్రాలను ప్రత్యేక ఓట్లుగా లెక్కించి భద్రపరచాలని సూచించింది. ఇతర ముద్రలతో వేసిన ఓట్లు ప్రభావం చూపని డివిజన్లలో ఫలితాలు ప్రకటించవచ్చునని ఉన్నత న్యాయస్థానం తెలిపింది.

విచారణ సోమవారానికి వాయిదా

ప్రత్యేక ఓట్లు... మెజార్టీ కన్నా ఎక్కువగా ఉంటాయని ఫలితాలు నిలిపివేయాలని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ఎస్ఈసీని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని ఎస్ఈసీ పేర్కొంది. స్టాంపు, టిక్ పెట్టిన ఓట్లను ప్రత్యేకంగా లెక్కించాలని హైకోర్టు ఆదేశం జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని సూచించింది. ప్రత్యేక ఓట్ల కంటే మెజార్టీ తక్కువ ఉంటే ఫలితం నిలిపివేయాలని హైకోర్టు పేర్కొంది.

ఇదీ చూడండి :లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రత: సీపీ సజ్జనార్

ABOUT THE AUTHOR

...view details