Trs Petition Was Dismissed By High Court: మునుగోడు ఉపఎన్నికలో కారును పోలిన 8 గుర్తులను తొలగించాలని తెరాస వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున ప్రస్తుతం జ్యోకం చేసుకోలేమని ధర్మాసనం తెలిపింది. 8 గుర్తులు తొలగించాలని తెరాస ఆ పిటిషన్లో పేర్కొంది. గతంలో 2018 ఎన్నికల్లో కారును పోలిన గుర్తుల వల్ల తమ అభ్యర్థులకు నష్టం జరిగిందని తెరాస చెబుతోంది. పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల కన్నా.. ఈ గుర్తులతో బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. కారును పోలి ఉన్నందునే వాటికి ఓట్లు పడ్డట్లు స్పష్టమవుతోందని ఈసీకి తెరాస వివరించింది.
మునుగోడు, జహీరాబాద్, సిర్పూర్, డోర్నకల్‌లో 2018 ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తుకు సీపీఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆ పార్టీ నేతలు తెలిపారు. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జునసాగర్‌లో కెమెరా గుర్తుకు కూడా బీఎస్పీ, సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయని తెరాస అంటోంది.