రాష్ట్రంలో డిగ్రీ, పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించగలరా అని ప్రభుత్వాన్ని హైకోర్టు అడిగింది. కరోనా ఉద్ధృతి తగ్గని కారణంగా పలువురు విద్యార్థులు పరీక్ష రాయకపోతే ఎలా అనే పలు అంశాలను తెలపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. చివరి సెమిస్టర్ పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ గతంలో కోరిన ఎన్ఎస్యూఐ... పరీక్షలు నిర్వహిస్తే అభ్యంతరం లేదు కానీ.. సెప్టెంబర్ తర్వాత ఆన్లైన్లో జరపాలని ఇవాళ కోరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్. చౌహన్, జస్టిస్ విజయ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.
విద్యార్థులకు ఇబ్బంది
స్వస్థలాల్లో ఉన్న విద్యార్థులు పరీక్షల కోసం యూనివర్సిటీ కేంద్రాలకు వెళ్లడం కష్టమవుతుందని ఎన్ఎస్యూఐ తరపు న్యాయవాది దామోదర్ రెడ్డి వాదించారు. హాస్టళ్లు మూసివేసి ఉన్నందున విద్యార్థులకు ఇబ్బందిగా ఉంటుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ తర్వాత పరీక్షలు నిర్వహించుకోవడానికి యూజీసీని ప్రభుత్వం అనుమతి కోరాలన్నారు. చివరి సెమిస్టర్ పరీక్షల్లో వ్యాసరూప సమాధానాలు ఉంటాయి కాబట్టి రాత పరీక్ష నిర్వహించాలని ఏజీ బీఎస్ ప్రసాద్ పేర్కొన్నారు.